ఓ మహిళ పేరు మీదున్న ప్రపంచంలోని ఏకైక దేశం ఇదే!

Saint Lucia is the only country in the world named after a woman
  • సెయింట్ లూసియా ఓ మహిళ పేరు మీదున్న ఏకైక దేశం
  • ఈ దేశానికి సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్ పేరు
  • లూసీ మూడో శతాబ్దంలో జీవించిన క్రైస్తవ మహిళ
  • ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చిందనే విషయంలో భిన్న కథనాలు
ప్రపంచంలో దాదాపు 200 దేశాలు ఉన్నాయి. వాటి పేర్ల వెనక రాజులు, రాజవంశాలు, తెగలు, నదులు, పర్వతాల కథలు దాగి ఉంటాయి. కానీ ఓ దేశం మాత్రం వీటన్నింటికీ భిన్నం. ఎందుకంటే ఆ దేశానికి ఓ మహిళ పేరు పెట్టారు. అది కూడా చరిత్రలో నిజంగా జీవించిన మహిళ పేరు. కరేబియన్ సముద్రంలో ఉన్న చిన్న ద్వీప దేశం సెయింట్ లూసియా ఈ అరుదైన గుర్తింపుతో ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక స్థానం సంపాదించింది.

సెయింట్ లూసియా అనే పేరు వెనకున్న మహిళ సెయింట్ లూసీ ఆఫ్ సిరాక్యూస్. మూడో శతాబ్దంలో ఇటలీలోని సిసిలీ ప్రాంతంలో జీవించిన ఆమె క్రైస్తవ విశ్వాసాల కోసం ప్రాణత్యాగం చేసిన మహిళగా చరిత్రలో నిలిచిపోయారు. పేదలకు సహాయం చేయడం, తన విశ్వాసాన్ని వదులుకోకుండా నిలబడటం వల్ల క్రైస్తవ ప్రపంచంలో ఆమెకు ప్రత్యేక గౌరవం లభించింది.

ఈ ద్వీపానికి సెయింట్ లూసియా అనే పేరు ఎలా వచ్చిందన్న విషయంపై స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఫ్రెంచ్ నావికులు సెయింట్ లూసీ జయంతి రోజున ఈ ద్వీపాన్ని చేరుకున్న తర్వాత ఆమె పేరును పెట్టారని ఒక కథనం చెబుతోంది. మరో కథనం ప్రకారం డిసెంబరు 13న ద్వీపాన్ని గుర్తించిన ఫ్రెంచ్ అన్వేషకులు ఆ పేరు పెట్టారు. ఏ కథనం నిజమైనదో తేలకపోయినా 16వ శతాబ్దం నుంచే మ్యాప్‌లలో సెయింట్ లూసియా పేరు కనిపించడం ప్రారంభమైంది.

యూరోపియన్లు రాకముందు ఈ ద్వీపానికి వేరే పేర్లు ఉండేవి. దక్షిణ అమెరికా నుంచి వచ్చిన అరావాక్ ప్రజలు దీనిని ‘ఇయోవనలావో’ అని పిలిచేవారు. తర్వాత అక్కడ స్థిరపడిన కలినాగో ప్రజలు హెవనోరా అనే పేరుతో వ్యవహరించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే నేటికీ దేశంలోని ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయం హెవనోరా పేరుతోనే కొనసాగుతోంది.

ఈ ద్వీపం కోసం ఒకప్పుడు ఫ్రాన్స్, బ్రిటన్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నోసార్లు పాలకులు మారినా సెయింట్ లూసియా అనే పేరు మాత్రం అలాగే కొనసాగింది. చివరకు బ్రిటన్ అధీనంలోకి వెళ్లిన ఈ దేశం 1979లో స్వాతంత్ర్యం పొందింది. ప్రస్తుతం సుమారు 1.8 లక్షల జనాభా ఉన్న సెయింట్ లూసియా ప్రకృతి అందాలకు కూడా ప్రసిద్ధి చెందింది. సముద్ర తీరాలు, అగ్నిపర్వత శిఖరాలు, దట్టమైన అడవులు ఈ దేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిన్న దేశమే అయినా ఓ చారిత్రక మహిళ పేరు మీద ప్రపంచంలోనే ఏకైక స్వతంత్ర దేశంగా సెయింట్ లూసియా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంది.
Go Back to Shorts
Saint Lucia
Saint Lucy of Syracuse
Caribbean Island
World History
Island Nation
Hewanorra

More Telugu News