హైదరాబాద్‌లోని దుర్గం చెరువులో విషాదం చోటుచేసుకుంది. మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి పైనుంచి చెరువులో దూకి 29 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడిని నల్లగండ్లలోని మీరో అపార్ట్‌మెంట్స్‌లో నివసించే సాయి మహేశ్వర్‌గా పోలీసులు గుర్తించారు.

సాయి మహేశ్వర్ శనివారం మధ్యాహ్నం సమయంలో కేబుల్ బ్రిడ్జిపై నుంచి దుర్గం చెరువులోకి దూకేశాడు. సమాచారం అందుకున్న వెంటనే మాదాపూర్ పోలీసులు, డీఆర్ఎఫ్‌ బృందం రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. అనంతరం అతని మృతదేహాన్ని వెలికితీశాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. సాయి మహేశ్వర్ గతంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి కొంతకాలం మొబైల్ షాపు నడిపాడు. ప్రస్తుతం అతను ఖాళీగా ఉంటున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు గల కచ్చితమైన కారణాలపై విచారణ జరుపుతున్నారు.