బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తన 61వ పుట్టినరోజును పురస్కరించుకుని అభిమానులకు అదిరిపోయే కానుకను అందించాడు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ స్పై యాక్షన్ చిత్రం ‘కింగ్’ నుంచి తొలి పాటను విడుదల చేశారు. ‘తు మిల్ జాయే’ పేరుతో వచ్చిన ఈ గీతాన్ని ఆదివారం రాత్రి విడుదల చేయగా, ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది.

ఈ పాటలో షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. బీచ్, కేఫ్ వంటి రమణీయ లొకేషన్లలో వీరిద్దరిపై చిత్రీకరించిన సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. సచిన్-జిగర్ సంగీతం సమకూర్చిన ఈ గీతాన్ని అరిజిత్ సింగ్, మధుబంతి బాగ్చి ఆలపించారు. ప్రముఖ అంతర్జాతీయ సింగర్ ఎడ్ షీరన్ ఆలపించిన ఇంగ్లిష్ ర్యాప్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనికి కుమార్ హిందీ సాహిత్యం అందించగా, ఎడ్ షీరన్ ర్యాప్ రాశారు. ఈ వీడియోలో షారుఖ్ తన షర్ట్‌లెస్ లుక్‌తో పాటు కొన్ని పవర్‌ఫుల్ యాక్షన్ సీక్వెన్సులతో అలరించాడు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో షారుఖ్ ఖాన్‌తో పాటు ఆయన కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కింగ్’ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.