భారత సంతతికి చెందిన ప్రముఖ టెక్నాలజీ నిపుణుడు, మైక్రోసాఫ్ట్ ఉన్నతిలో కీలక పాత్ర పోషించిన శివరామకృష్ణన్ "సోమ" సోమశేఖర్‌కు అమెరికాలో అరుదైన గౌరవం లభించింది. టెక్నాలజీ, ఆవిష్కరణలు, సమాజ సేవకు ఆయన అందించిన విశేష సేవలను గుర్తిస్తూ అమెరికా ప్రతినిధుల సభ (హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్) ఆయనను గౌరవించింది. ఈ సందర్భంగా వాషింగ్టన్ కాంగ్రెస్ సభ్యురాలు సుజాన్ డెల్బెన్ మాట్లాడుతూ.. సోమశేఖర్‌ను "మా కమ్యూనిటీలో ఒక అద్భుతమైన టెక్నాలజిస్ట్, వ్యవస్థాపకుడు, నాయకుడు, స్నేహితుడు" అని కొనియాడారు.

దక్షిణ భారతదేశంలో పుట్టి పెరిగిన సోమశేఖర్, ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లి లూసియానా స్టేట్ యూనివర్సిటీలో చదువుకున్నారు. 1989లో మైక్రోసాఫ్ట్‌లో చేరిన ఆయన, ఆ సంస్థ చరిత్రలోనే అత్యంత కీలకమైన ఉత్పత్తులలో ఒకటైన విండోస్ ఎన్‌టీ అభివృద్ధిలో కీల‌క పాత్ర‌ పోషించారు. తన అసాధారణమైన మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, అంకితభావం, పని పట్ల నిబద్ధతతో ఆయన మైక్రోసాఫ్ట్‌లో ఉన్నత స్థాయికి ఎదిగారని, 2015 వరకు సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారని డెల్బెన్ గుర్తుచేసుకున్నారు. "మైక్రోసాఫ్ట్‌లో మేమిద్దరం కలిసి పనిచేసే సమయంలో ఆయనతో నాకు పరిచయం ఏర్పడింది. ఆయన చిరునవ్వు, ఉత్సాహం గదిలో ఉన్న ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేది" అని ఆమె అన్నారు.

మైక్రోసాఫ్ట్ నుంచి వైదొలిగిన తర్వాత సోమశేఖర్ ప్రముఖ వెంచర్ క్యాపిటల్ సంస్థ 'మడ్రోనా వెంచర్ గ్రూప్'లో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేరారు. ఈ హోదాలో ఆయన ఎన్నో టెక్నాలజీ స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేసి, పసిఫిక్ నార్త్‌వెస్ట్ ప్రాంతంలో ఆవిష్కరణల వ్యవస్థను బలోపేతం చేయడానికి కృషి చేశారు.

వ్యాపార, సాంకేతిక రంగాలతో పాటు కమ్యూనిటీ కార్యక్రమాల్లోనూ సోమశేఖర్ చురుగ్గా పాల్గొన్నారు. 'సియాటిల్ ఓర్కాస్' క్రికెట్ ఫ్రాంచైజీ సహ వ్యవస్థాపకుడిగా, ఆ ప్రాంతంలో ప్రొఫెషనల్ క్రికెట్‌ను ప్రోత్సహించారు. అంతేకాకుండా మహిళా సాధికారతకు బలమైన మద్దతుదారుగా నిలిచి, వారికి అవకాశాలు కల్పించే సంస్థలకు అండగా ఉన్నారు. తన ప్రసంగంలో డెల్బెన్ ఆయన కుటుంబానికి ఉన్న ప్రాధాన్యతను ప్రత్యేకంగా ప్రస్తావించారు. సోమశేఖర్ భార్య అకిల, ఇద్దరు కుమార్తెలే ఆయన ప్రపంచమని, వారి గురించి ఎంతో అభిమానంతో, గర్వంతో మాట్లాడేవారని తెలిపారు. సోమశేఖర్ సాధించిన ప్రతి విజయం వెనుక వారి ప్రేమ, మద్దతు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. ఆయన స్ఫూర్తిని, దయను, వివేకాన్ని స్మరించుకోవాలని చట్టసభ సభ్యులకు ఆమె పిలుపునిచ్చారు.