తప్పుడు ప్రచారాలు చేస్తే.. క్రిమినల్ కేసులు తప్పవు: అనిత

Anitha fires on YSRCP leaders
  • ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీకి అలవాటుగా మారిందన్న అనిత
  • ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వైసీపీది అని విమర్శ
  • డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక

వైసీపీ నాయకులకు కేవలం సమస్యలు సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడమే అలవాటుగా మారిందని, వారికి సమాధానాలు వినే ఓపిక కూడా లేదంటూ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులను తీసుకెళ్లి మద్యం దుకాణాల ముందు నిలబెట్టిన ఘనత వారిదేనని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షలపై ఆ పార్టీ నేతలు చేస్తున్న విమర్శల్లో ఎలాంటి నిజం లేదని, గతంలో వారు గ్రూప్-1 పరీక్షలను ఎంత అధ్వానంగా నిర్వహించారో ప్రజలందరూ చూశారని గుర్తుచేశారు.


డీఎస్సీ ప్రక్రియలో అక్రమాలు జరిగాయంటూ కేవలం నోటి మాటలతో తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదని, అలాంటి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హోంమంత్రి గట్టిగా హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులలో అత్యధిక శాతం మంది గతంలో టీడీపీ హయాంలోనే నియమితులయ్యారని, గతంలోని సమస్యలన్నింటినీ పరిష్కరించి తాము ఎంతో గౌరవప్రదంగా నియామక పత్రాలను అందించామని స్పష్టం చేశారు. 


'బ్రిడ్జ్ స్పోర్ట్స్' అంశంపై అవగాహన లేకుండా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అనిత ఎద్దేవా చేశారు. బ్రిడ్జ్ స్పోర్ట్స్ అంటే గొడ్డలి పార్టీ నాయకులు గతంలో నడిపించిన జూదం క్లబ్‌లు కావని చురకలు అంటించారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
Anitha
TDP
YSRCP

More Telugu News