Advertisement

బాధితుల్ని గాలికొదిలేసి.. నిందితుడి కుటుంబానికి పరామర్శనా?: జగన్‌పై లోకేష్ ఆగ్రహం

Nara Lokesh slams YS Jagan Mohan Reddy for visiting accused family while ignoring victims
  • హిట్ అండ్ రన్ కేసులో జగన్ తీరుపై మంత్రి లోకేష్ ఆగ్రహం
  • శ్రీకాకుళం పర్యటనలో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబాన్ని కలిసిన జగన్
  • ఇది పరామర్శ కాదు, నేరస్థ మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ ట్వీట్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన హిట్ అండ్ రన్ కేసులో బాధితుడి కుటుంబాన్ని విస్మరించి, నిందితుడి కుటుంబ సభ్యులను పరామర్శించడంపై ఆయన మండిపడ్డారు. ఇది పరామర్శ కాదని, నేరపూరిత మనస్తత్వానికి పరాకాష్ట అని లోకేష్ 'ఎక్స్' వేదికగా ధ్వజమెత్తారు.

విచక్షణ ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో మరణించిన బీసీ సామాజిక వర్గానికి చెందిన గొర్రెల కాపరి డి. దానయ్య కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారని, అయితే జగన్ మాత్రం బాధితులను వదిలి నిందితుల పక్షాన నిలిచారని లోకేష్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన #PsychoFekuJagan, #YcpCriminalPolitics అనే హ్యాష్‌ట్యాగ్‌లను జత చేశారు.

గురువారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించిన జగన్ మోహన్ రెడ్డి, హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారన్న ఆరోపణలతో జైలులో రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును కలిసేందుకు వెళ్లారు. అయితే, ఆయన సాయంత్రం 5 గంటల తర్వాత చేరుకోవడంతో జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో జైలు వెలుపల అప్పలరాజు కుటుంబ సభ్యులను కలిసి జగన్ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఒక సాధారణ ప్రమాద ఘటనను హత్య కేసుగా చిత్రీకరిస్తూ ప్రభుత్వం రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపించారు.

జగన్ చర్యలపై లోకేష్ తీవ్రంగా స్పందిస్తూ, "మనస్సాక్షి ఉన్న ఏ నాయకుడైనా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన బీసీ సోదరుడు దానయ్య గారి కుటుంబాన్ని పరామర్శించి అండగా నిలుస్తారు. కానీ హిట్ అండ్ రన్ కేసులో ఒక నిండు ప్రాణం బలైన ఘటనలో మృతుని కుటుంబాన్ని విస్మరించి, నిందితుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన జగన్ రెడ్డి తీరు అమానవీయ ప్రవర్తనకు నిదర్శనం. ప్రపంచ రాజకీయ చరిత్రలోనే బాధితులను వదిలేసి, నిందితులకు అండగా నిలిచే రాజకీయం చేయడం బహుశా జగన్ రెడ్డి గారికే చెల్లింది. ఇది పరామర్శ కాదు, నేర మనస్తత్వానికి పరాకాష్ట!" అని దుయ్యబట్టారు.
Advertisement
YS Jagan Mohan Reddy
Nara Lokesh
Seediri Appalaraju
Srikakulam hit and run
Andhra Pradesh politics

More Telugu News