అమెరికాలో ఉద్యోగానికి రూ.85 లక్షల ఫీజు విధింపు?.. ట్రంప్‌ ప్రభుత్వం యోచన!

Donald Trump administration considers 85 lakh fee for US jobs
  • ఓపీటీకి 1 లక్ష డాలర్ల ఫీజు విధించాలని ప్రతిపాదన
  • చదువు తర్వాత ఉద్యోగ అవకాశాలపై ప్రభావం
  • హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంలో చర్చలు
  • 3.3 లక్షల భారత విద్యార్థులపై ప్రభావం
  • ఇంకా వెలువడని తుది నిర్ణయం
అమెరికాలో చదవాలనుకునే విదేశీ విద్యార్థులకు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం భారీ షాక్‌ ఇచ్చే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. చదువు పూర్తయ్యాక అక్కడ ఉద్యోగం చేయడానికి ఉపయోగపడే ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌’ (ఓపీటీ)కు 1 లక్ష డాలర్ల ఫీజు విధించే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.85 లక్షలు. ఈ ప్రతిపాదనపై హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగంలో చర్చలు జరుగుతున్నాయని సమాచారం.

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ప్రస్తుతం ఎఫ్‌-1 వీసాపై చదివే విద్యార్థులు డిగ్రీ పూర్తయ్యాక ఓపీటీ కింద ఏడాది పాటు ఉద్యోగం చేయొచ్చు. స్టెమ్‌ కోర్సులు చదివిన వారికి మూడేళ్ల వరకు అవకాశం ఉంటుంది. తర్వాత హెచ్‌-1బీ ఉద్యోగ వీసాకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇప్పుడు ఈ ఓపీటీ అవకాశం కోసం భారీ ఫీజు వసూలు చేయాలనే ట్రంప్ యంత్రాంగం ఆలోచన విద్యార్థుల్లో కలకలం రేపుతోంది.

మరోవైపు విదేశీ విద్యార్థుల వీసా నిబంధనల్లో కూడా మార్పులు తీసుకురానుంది. ఇప్పటి వరకు కోర్సు పూర్తయ్యేంత వరకు అమెరికాలో ఉండే వెసులుబాటు ఉండేది. కొత్త నిబంధన అమల్లోకి వస్తే చాలా మందికి నాలుగేళ్లే అనుమతి ఉంటుంది. అంతకంటే ఎక్కువ చదవాలంటే గడువు ముగిసేలోపు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి ఇంకా కాంగ్రెస్‌ ఆమోదం రావాల్సి ఉంది.

ఈ నిర్ణయాలు అమల్లోకి వస్తే భారత విద్యార్థులపై భారీ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షలకుపైగా భారత విద్యార్థులు చదువుతున్నారు. ఓపీటీపై భారీ ఫీజు విధిస్తే విదేశీ విద్యార్థులను ఉద్యోగంలోకి తీసుకోవడంపై కంపెనీలు వెనుకంజ వేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ ఫీజు ప్రతిపాదనకు ఇంకా తుది ఆమోదం లభించలేదు.
Advertisement
Donald Trump
OPT Fee
US Student Visa
Indian Students in USA
F1 Visa Changes
US Immigration Policy

More Telugu News