మోదీపై ఏఐ వీడియోల కలకలం.. మెటా ఇండియా చీఫ్‌పై కేసు నమోదు

Narendra Modi AI video row Case filed against Meta India Head
  • ఏఐ వీడియోలపై మెటా ఇండియా హెడ్‌పై ఎఫ్‌ఐఆర్‌
  • ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలపై దర్యాప్తు
  • మెటా భద్రతా వ్యవస్థలపైనా విచారణ
  • దర్యాప్తు ప్రారంభించిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌
  • బీఎన్‌ఎస్‌, ఐటీ చట్టాల కింద విచారణ
  • జంతర్‌మంతర్‌లో మోదీపై వ్యాఖ్యల నేపథ్యంలో మరో కేసు
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ మార్ఫింగ్‌ వీడియోల వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. మెటా ఇండియా హెడ్‌ అరుణ్‌ శ్రీనివాస్‌తో పాటు పలువురు సోషల్‌ మీడియా యూజర్లపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయిన మార్ఫింగ్‌ వీడియోలపై ఈ కేసు నమోదైంది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఈ వీడియోలు ఉన్నాయా? అన్న కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

భారతీయ న్యాయ సంహిత (బీఎన్‌ఎస్‌), సమాచార సాంకేతిక చట్టం కింద ఉల్లంఘనలు జరిగాయా అనే అంశాన్ని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ వీడియోలు ఎక్కడ తయారయ్యాయి? ఎవరు అప్‌లోడ్‌ చేశారు? ఎలా వైరల్‌ అయ్యాయన్న దానిపై ఆధారాలు సేకరిస్తున్నారు. ఇలాంటి కంటెంట్‌ను అడ్డుకోవడంలో మెటా భద్రతా వ్యవస్థలు ఎంతవరకు పనిచేశాయన్న అంశాన్ని కూడా విచారిస్తున్నారు.

కొన్ని రోజుల క్రితమే ఏఐ స్కామ్‌లు, నకిలీ ప్రకటనలు, మార్ఫింగ్‌ కంటెంట్‌ను గుర్తించి తొలగించే విధానంపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులను హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పిలిచారు. కంపెనీ ప్రతినిధి విచారణకు హాజరై కంటెంట్‌ మోడరేషన్‌ విధానాలను వివరించినట్లు సమాచారం. ప్రస్తుతం దర్యాప్తు ప్రారంభ దశలోనే ఉందని, డిజిటల్‌ ఆధారాలను బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

మరోవైపు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ నిరసన సందర్భంగా ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పలువురిపై కేసు నమోదైంది. నోయిడాకు చెందిన రుచికా సింగ్‌పై జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించేలా, విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు బీఎన్‌ఎస్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Advertisement
Narendra Modi
Meta India Head Arun Srinivas
Hyderabad Cyber Crime Police
AI Morphed Videos Case
Facebook Instagram Content Moderation
Ruchika Singh FIR

More Telugu News