ఫ్లాట్ ఓనర్లకు భారీ ఊరట.. బిల్డర్ల ఆశలకు బ్రేక్ వేసిన బాంబే హైకోర్టు

Bombay High Court provides big relief to flat owners and stops builders from claiming future FSI
  • కన్వేయెన్స్ తర్వాత ఎఫ్ఎస్ఐ హక్కులు సొసైటీలకేనని స్పష్టం చేసిన బాంబే హైకోర్టు
  • భవిష్యత్ ఎఫ్ఎస్ఐ కోసం కన్వేయెన్స్‌ను ఆలస్యం చేయడాన్ని తోసిపుచ్చిన న్యాయస్థానం
  • ప్రాజెక్ట్ పూర్తయ్యాక భూమి, భవనాన్ని సొసైటీకి బదిలీ చేయాల్సిందేనన్న కోర్టు
  • 'మోఫా' చట్టం ప్రకారం డెవలపర్లు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టీకరణ
  • ఈ తీర్పుతో మహారాష్ట్రలోని వేలాది హౌసింగ్ సొసైటీలకు భారీ ఊరట
ఫ్లాట్ కొనుగోలుదారులకు, హౌసింగ్ సొసైటీలకు భారీ ఊరటనిస్తూ బాంబే హైకోర్టు చరిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఒకసారి భవనం, భూమిని హౌసింగ్ సొసైటీకి బదిలీ (కన్వేయెన్స్) చేశాక, భవిష్యత్తులో నిబంధనల మార్పుల వల్ల లభించే అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ (FSI)పై హక్కులు సొసైటీకే చెందుతాయి తప్ప, డెవలపర్‌కు కాదని కోర్టు తేల్చి చెప్పింది. కేవలం భవిష్యత్తులో లభించే ఎఫ్ఎస్ఐ ప్రయోజనాల కోసం కన్వేయెన్స్‌ను నిలిపివేయడం లేదా ఆలస్యం చేయడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది.

విలే పార్లే (వెస్ట్)లోని అరిస్టో క్లౌడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి భూమి, భవనాన్ని ఏకపక్షంగా డీమ్డ్ కన్వేయెన్స్ మంజూరు చేస్తూ 2025 జులైలో అధికారులు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ అరిస్టో రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే డెవలపర్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ సందీప్ మార్నే, జూలై 17న ఈ పిటిషన్‌ను కొట్టివేశారు.

2018లో వచ్చిన కొత్త డెవలప్‌మెంట్ కంట్రోల్ అండ్ ప్రమోషన్ రెగ్యులేషన్స్ (DCPR) 2034 ప్రకారం తమ ప్రాజెక్టుకు అదనంగా 841.16 చదరపు మీటర్ల నిర్మాణ హక్కులు లభించాయని, దానిపై తమకే హక్కు ఉందని డెవలపర్ వాదించింది. అందువల్ల కన్వేయెన్స్‌ను వాయిదా వేయాలని కోరింది. ఈ వాదనను కోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. డెవలపర్ల వాదనను అంగీకరిస్తే, నిబంధనలు మారిన ప్రతిసారీ భవిష్యత్ లాభాల కోసం వారు యాజమాన్య బదిలీని నిరవధికంగా వాయిదా వేస్తూనే ఉంటారని, ఇది మహారాష్ట్ర ఓనర్‌షిప్ ఫ్లాట్స్ యాక్ట్ (MOFA) ఉద్దేశ్యాన్నే దెబ్బతీస్తుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

మోఫా చట్టం ప్రకారం, సొసైటీ ఏర్పడిన నాలుగు నెలల్లోగా డెవలపర్ తప్పనిసరిగా కన్వేయెన్స్ పూర్తి చేయాలి. ఒకవేళ డెవలపర్ విఫలమైతే, సొసైటీ 'డీమ్డ్ కన్వేయెన్స్' కోసం సంబంధిత అధికారులను ఆశ్రయించవచ్చు. భూ యజమానులతో డెవలపర్లు చేసుకున్న ప్రైవేట్ ఒప్పందాలు, చట్టబద్ధమైన ఈ బాధ్యతను అధిగమించలేవని కోర్టు స్పష్టం చేసింది.

ఈ తీర్పు ముంబై, ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌తో పాటు మహారాష్ట్ర వ్యాప్తంగా కన్వేయెన్స్ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది హౌసింగ్ సొసైటీలకు గొప్ప బలాన్ని చేకూర్చనుంది. నివేదికల ప్రకారం, ముంబైలో 30,000కు పైగా, రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా సొసైటీలకు ఇంకా కన్వేయెన్స్ జరగలేదు. కన్వేయెన్స్ జరిగితే భూమి, ఉమ్మడి ప్రాంతాలపై సొసైటీకి పూర్తి యాజమాన్య హక్కులు లభించి, నిర్వహణ, పునఃనిర్మాణం వంటి నిర్ణయాలు స్వతంత్రంగా తీసుకునే వీలు కలుగుతుంది.
Advertisement
Bombay High Court
Housing Society FSI rights
Aristo Realtors case
MOFA Act Maharashtra
Deemed Conveyance Mumbai
Flat owner legal rights

More Telugu News