కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం.. ఆరుగురి మృతి

Bhiwandi building collapse leaves six dead in Maharashtra
  • మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో ఘటన
  • శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు అనుమానం
  • ఓ మహిళను సజీవంగా రక్షించిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌
  • భవనం ఒరగడంతో కొందరు ముందే బయటకు
  • ప్రత్యక్ష సాక్షుల కళ్లముందే ఘోర ప్రమాదం
  • శిథిలాల తొలగింపు కొనసాగిస్తున్న సహాయక బృందాలు
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలింది. అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ‘జాతీయ విపత్తు స్పందన దళం’ (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), ‘రాష్ట్ర విపత్తు స్పందన దళం’ (ఎస్‌డీఆర్‌ఎఫ్‌) బృందాలు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టాయి.

బుధవారం అర్ధరాత్రి భవనం ఒకవైపు ఒరిగినట్లు గుర్తించారు. ప్రమాదాన్ని గమనించిన కొందరు కార్మికులు వెంటనే బయటకు వెళ్లడంతో కొంత వరకు ప్రాణనష్టం తప్పినట్లు అధికారులు భావిస్తున్నారు. ఆ సమయంలో భవనంలో మరమ్మతు పనులు జరుగుతున్నట్లు సమాచారం. శిథిలాల నుంచి ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. మరో మహిళను సజీవంగా రక్షించి ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

ప్రమాదం నుంచి బయటపడిన దీపక్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. భోజనం చేసి నిద్రపోతుండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించిందన్నారు. బయటకు రాగానే భవనం కూలిపోవడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకోవడానికి మొదటి అంతస్తు నుంచి దూకానని తెలిపారు. మరో బాధితుడు అభయ్‌ కుమార్‌ యాదవ్‌ కూడా మొదటి అంతస్తు నుంచి దూకి బయటపడ్డాడు. ఈ ఘటనలో అతడి కాలికి తీవ్ర గాయమైంది.

స్థానికురాలు నేహా సింగ్‌ మాట్లాడుతూ.. తన భర్త రంజిత్‌ సింగ్‌ కిందికి వెళ్లిన పది నిమిషాల్లోనే భవనం కూలిపోయిందన్నారు. అప్పటి నుంచి ఆయన ఆచూకీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవనంలో సుమారు 45 గదులు ఉండగా, ఘటన సమయంలో 25 నుంచి 30 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. భారీ శిథిలాల కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఎదురవుతోందని అధికారులు వెల్లడించారు.
Advertisement
Bhiwandi building collapse
Thane Maharashtra
NDRF SDRF rescue operations
Building collapse deaths
Four story building collapse
Maharashtra news

More Telugu News