తాళం వేసిన దుకాణంలో రూ. 10 లక్షల ఆభరణాల మాయం.. సీసీటీవీ చూసి షాకైన యజమాని.. ఇంత‌కీ దొంగ ఎవ‌రో తెలుసా?

Jewelry worth 10 lakh missing from locked shop owner shocked after seeing CCTV
  • కర్ణాటక జ్యువెలరీ షాపులో రూ.10 లక్షల విలువైన నగలు మాయం
  • బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు లేకపోవడంతో య‌జ‌మాని అయోమయం
  • సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఎలుక పనిగా నిర్ధారణ
  • ఎలుక కలుగును తవ్వి నగలను స్వాధీనం చేసుకున్న వైనం
కర్ణాటకలోని తుమకూరులో ఓ విచిత్ర సంఘటన వెలుగులోకి వచ్చింది. ఓ నగల దుకాణంలోకి చొరబడిన ఎలుక, ఏకంగా రూ.10 లక్షల విలువైన ఆభరణాలను ఎత్తుకెళ్లింది. ఈ వింత దొంగతనం మొత్తం అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డు కాగా, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల్లోకి వెళితే.. తుమకూరులోని ఓ జ్యువెలరీ షాపులో కొన్ని వజ్రాలు పొదిగిన బంగారు ఆభరణాలు కనిపించకుండా పోయాయి. దుకాణాన్ని బలవంతంగా తెరిచిన ఆనవాళ్లు ఏవీ లేకపోవడంతో య‌జ‌మాని తీవ్ర అయోమయానికి గురయ్యాడు. ఏం జరిగిందో అర్థం కాక, పోలీసులకు ఫిర్యాదు చేసే ముందు ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించాలని నిర్ణయించుకున్నాడు.

ఫుటేజ్‌ను చూడగా ఊహించని దృశ్యం కనిపించింది. ఓ ఎలుక ఒక్కో ఆభరణాన్ని నోటకరచుకుని లాక్కెళ్లడం స్పష్టంగా రికార్డయింది. దీంతో ఆ జ్యువెలరీ షాపులోని  సిబ్బంది వెంటనే అప్రమత్తమై, ఆ ఎలుక వెళ్లిన దారిని అనుసరించారు. అది సమీపంలోని ఓ కలుగులోకి వెళ్లినట్లు గుర్తించి, దాన్ని తవ్వారు.

కలుగు లోపల చూడగా, మాయమైన నగలు మొత్తం అక్కడే కనిపించాయి. వాటిలో 10 వజ్రాలు పొదిగిన బంగారు ఉంగరాలు, మూడు నెక్లెస్‌లు ఉన్నాయి. సిబ్బంది వాటిని స్వాధీనం చేసుకుని ఊపిరి పీల్చుకున్నారు. మొత్తానికి దొంగ ఎవరో తెలియడంతో అంతా విస్తుపోయారు.  
Advertisement
Rat
Tumakuru Jewelry Theft
Karnataka News
CCTV Viral Video
Diamond Rings Recovery
Jewelry Shop Robbery

More Telugu News