అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్ల వర్షం

Iran launches drone attacks on US military bases
  • బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై దాడి చేసిన ఇరాన్
  • డ్రోన్లతో పవర్ జనరేటర్లు, నావిగేషన్ వ్యవస్థలను టార్గెట్ చేశామని ప్రకటన
  • కువైట్, జోర్డాన్‌లలోని యూఎస్ స్థావరాలపైనా దాడులు
  • తమపై అమెరికా దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలని వెల్లడి
  • తమ భూభాగాలను వాడనివ్వొద్దని బల్గేరియా, సైప్రస్‌లకు ఇరాన్ వార్నింగ్
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రస్థాయికి చేరాయి. బహ్రెయిన్‌లోని షేక్ ఇసా వైమానిక స్థావరంలో ఉన్న అమెరికా మౌలిక సదుపాయాలు, ఆస్తులపై డ్రోన్లతో దాడి చేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. గురువారం జరిగిన ఈ దాడుల్లో యూఎస్ సైన్యానికి చెందిన పవర్ జనరేటర్లు, నావిగేషన్ వ్యవస్థలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తమ వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

అంతకుముందు, కువైట్‌లోని అలీ అల్ సేలం, జోర్డాన్‌లోని అల్-అజ్రక్ వైమానిక స్థావరాల్లోని అమెరికా ఆస్తులపైనా దాడులు చేసినట్లు ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తెలిపింది. బుధవారం రాత్రి తమపై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాల్పడినట్లు ఇరాన్ స్పష్టం చేసింది.  

హర్మూజ్ జలసంధిలో వాణిజ్య నౌకలకు ఇరాన్ ముప్పుగా మారిందన్న కారణంతో అమెరికా గతంలో పలు దాడులు నిర్వహించింది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా ఈ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేస్తోంది.

ఇదిలా ఉండగా, తమ భూభాగాల నుంచి ఇరాన్‌పై దాడులకు అమెరికాను అనుమతించవద్దని బల్గేరియా, సైప్రస్ దేశాలను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ హెచ్చరించారు. ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. అయితే, తాము ఇరాన్‌తో యుద్ధంలో పాల్గొనబోమని, దౌత్య మార్గాల ద్వారా ఉద్రిక్తతలను తగ్గించేందుకే మద్దతిస్తామని బల్గేరియా, సైప్రస్ స్పష్టం చేశాయి.
Advertisement
Iran
US military bases
Drone attacks
IRGC
Middle East tensions
Bahrain Sheikh Isa Air Base

More Telugu News