సహజీవనం చేసి, విడిపోయేటప్పుడు లైంగిక దాడి అంటే ఎలా?: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Live n Relationships and Sexual Assault Allegations
  • పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, లైంగిక నేరాలకు తేడా ఉందన్న కోర్టు
  • కలిసి జీవించి, బిడ్డను కని, ఇప్పుడు అత్యాచారం అంటున్నారని వ్యాఖ్య
  • ఇది సహజీవనానికి సంబంధించిన కేసు అన్న సుప్రీంకోర్టు
పెళ్లి చేసుకుంటానని చెప్పి తనపై అత్యాచారం, లైంగిక దాడికి పాల్పడ్డాడని ఒక వ్యక్తిపై ఆరోపణలు చేస్తూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో కూడిన సహజీవనానికి, నేరపూరిత లైంగిక నేరాలకు మధ్య తేడాను కోర్టు నొక్కి చెప్పింది. ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తన సహజీవన భాగస్వామిపై సదరు మహిళ లైంగిక దాడికి పాల్పడ్డాడంటూ పిటిషన్ వేసింది.

పరస్పర అంగీకారంతో ఏర్పడిన ఆ బంధం వీగిపోయిన తర్వాత అది లైంగిక దాడి ఎలా అవుతుందని జస్టిస్ బీవీ నాగరత్న కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు సహజీవనానికి సంబంధించినదని, వివాహం కాకుండానే మహిళ బిడ్డకు కూడా జన్మనిచ్చిందని తెలిపారు.

కానీ ఇప్పుడు ఆమె దాడి, అత్యాచారం అంటోందని అన్నారు. సమ్మతితో ఏర్పడిన బంధం చివరకు దాడిగా ఎలా మారిందని ప్రశ్నించారు. వివాహ ప్రస్తావన లేకుండా ఏర్పడిన బంధాల్లో ఉన్న సమస్యలు ఇవేనని, కొన్నేళ్లపాటు కలిసి ఉన్న ఆ మహిళ ఇప్పుడు ఫిర్యాదు చేయడమేమిటని ప్రశ్నించారు.

పిటిషనర్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, నిందితుడు ఆ మహిళను కలిసినప్పుడు ఆమె వయస్సు పద్దెనిమిది అని, అప్పుడు ఆమె ఒక వితంతువు అని కోర్టుకు తెలిపారు. అతడికి కూడా అప్పటికే పెళ్లి అయిపోయిందని, కానీ ఆ విషయాన్ని దాచిపెట్టి అతడు సంబంధాన్ని కొనసాగించాడని పేర్కొన్నారు. ఇతర మహిళలను కూడా అతడు ఇలాగే మోసం చేశాడని అన్నారు.

అయితే, ఆమె పెళ్లి చేసుకోవడానికి బదులు కలిసి జీవించడానికి ఎందుకు అంగీకరించిందని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం లైంగిక దాడి కాదని స్పష్టం చేశారు. అలాగే మహిళ పరిస్థితిపై న్యాయమూర్తి సానుభూతి వ్యక్తం చేశారు. ఆ బిడ్డ పోషణ కోసం భరణం కోరవచ్చని సూచించారు. ఈ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవచ్చని అన్నారు.
Go Back to Shorts
Supreme Court of India
Live-in relationship
Sexual assault
Justice BV Nagarathna
Rape allegation

More Telugu News