ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) రిటెన్షన్ గడువు సమీపిస్తున్న వేళ, క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించే పరిణామం ఒకటి చోటుచేసుకుంది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను పంజాబ్ కింగ్స్‌కు బదిలీ చేసేందుకు ముంబై ఇండియన్స్ (ఎంఐ) అంగీకరించినట్లు తెలుస్తోంది. ఈ మెగా ట్రేడ్‌లో భాగంగా పంజాబ్ నుంచి యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్ బ్యాటర్ విష్ణు వినోద్ ముంబై ఇండియన్స్ జట్టులోకి రానున్నారు.

ప్రముఖ క్రీడా మ్యాగజైన్ 'స్పోర్ట్‌స్టార్' తన కథనంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్) ఉన్నత యాజమాన్యాల మధ్య చర్చలు దాదాపు కొలిక్కి వచ్చినట్లు పేర్కొంది. అయితే, ఈ భారీ డీల్‌పై ఇరు ఫ్రాంచైజీలు ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. 

"రికీ పాంటింగ్ కోచ్‌గా ఉన్న ఫ్రాంచైజీ (పంజాబ్) ముంబై ఇండియన్స్‌తో చర్చలలో పురోగతి సాధించింది. హార్దిక్ పాండ్యాకు బదులుగా పేసర్ అర్ష్‌దీప్ సింగ్, వికెట్ కీపర్ విష్ణు వినోద్‌లను పంపే అవకాశం ఉంది" అని ఆ కథనం పేర్కొంది.

ఐపీఎల్ 2026 సీజన్ ముగిసినప్పటి నుంచి హార్దిక్ పాండ్యాను ముంబై యాజమాన్యం వదులుకోవాలని చూస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌), రాజస్థాన్ రాయల్స్ (ఆర్‌ఆర్‌), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) వంటి జట్లతో ముంబై చర్చలు జరిపింది. 

హార్దిక్‌కు బదులుగా హర్షిత్ రాణా, అంగ్‌క్రిష్ రఘువంశీలను కేకేఆర్ నుంచి ముంబై కోరగా, అందుకు ఆ జట్టు నిరాకరించింది. అలాగే, యశస్వి జైస్వాల్, రవి బిష్ణోయ్‌ల కోసం రాజస్థాన్‌తో, ఆయుష్ మాత్రే కోసం చెన్నైతో జరిపిన చర్చలు కూడా విఫలమయ్యాయి.

అయితే, ఎవరూ ఊహించని విధంగా పంజాబ్‌తో డీల్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత గాయంతో మైదానానికి దూరంగా ఉన్న హార్దిక్, నేరుగా ఐపీఎల్ 2027 సీజన్‌లోనే ఆడతాడని అంచనా. ఈ అనూహ్య ట్రేడ్ కారణంగా ఐపీఎల్ మార్కెట్‌లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. 

ఈ డీల్ తర్వాత పంజాబ్ జట్టు, మార్కస్ స్టోయినిస్‌ను లక్నో సూపర్ జెయింట్స్‌కు ట్రేడ్ చేసి, వారి నుంచి ఎడమచేతి వాటం పేసర్ మొహ్సిన్ ఖాన్‌ను తీసుకునేందుకు ప్రయత్నించవచ్చని కూడా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.