ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో తెలుగుదేశం పార్టీ ప్రభంజనం సృష్టించింది. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకోగా, మరొకటి మిత్రపక్షమైన బీజేపీ దక్కించుకుంది. ఈ ఫలితాలతో వైసీపీ కంచుకోటగా భావించే కడప జిల్లాలో ఆ పార్టీ ఖాతా తెరవలేకపోయింది.

మంగళవారం వెలువడిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కడప జిల్లాలోని బద్వేల్, రాజంపేట, రాయచోటి, మైదుకూరు మున్సిపాలిటీల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మరో కీలకమైన యర్రగుంట్ల మున్సిపాలిటీ (నగర పంచాయమతీ)ని బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో జిల్లాలోని మొత్తం ఐదు పురపాలికలు టీడీపీ-బీజేపీ కూటమి ఖాతాలో పడ్డాయి.

దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి రాజకీయంగా అండగా నిలుస్తున్న కడప జిల్లాలో, ముఖ్యంగా జగన్ సొంత గడ్డపై వైసీపీ ఒక్క మున్సిపాలిటీలో కూడా గెలవలేకపోవడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ఈ అనూహ్య ఫలితాలు జిల్లాలోని టీడీపీ, బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ఫలితాలు వెలువడిన వెంటనే టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. ఇది ప్రజల విజయమని, వైసీపీ పాలనపై తిరస్కారానికి నిదర్శనమని కూటమి నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ గెలుపు రాయలసీమ రాజకీయ సమీకరణాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.