హైదరాబాద్‌లో వేలాది గొంతుకలతో హనుమాన్ చాలీసా పారాయణం

Hanuman Chalisa Recitation in Hyderabad with Thousands of Voices
  • మైహోమ్ అవతార్‌లో హిందూ మహా సమ్మేళన్
  • 21 సార్లు సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం
  • ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్
  • హనుమ సాధనతో ధైర్యంగా సాగాలని యువతకు పిలుపు
హైదరాబాద్‌లోని మైహోమ్ అవతార్ గ్రౌండ్స్‌లో హిందూ మహా సమ్మేళన్ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వేలాది మంది భక్తులు పాల్గొని 21 సార్లు హనుమాన్ చాలీసాను పఠించడంతో మైదానంలో భక్తి వాతావరణం నెలకొంది.

హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నిర్వాహక కమిటీ అధ్యక్షులు దేవిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సమన్వయకర్తలు చంద్రశేఖర్ గాంధీ, శ్రీమతి జగన్మోహిని, జమలాపురం రాధాకృష్ణ కీలక పాత్ర పోషించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ హాజరు కాగా, సీనియర్ పాత్రికేయులు రాకా సుధాకర్ రావు, అహం టాక్స్ అధినేత్రి మోనికారెడ్డి ప్రసంగించారు.

ఈ సందర్భంగా పురాణపండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. మహావీరుడైన హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకుని, ఆయన సాధనతో ఈతరం యువత ధైర్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగం సభికులను విశేషంగా ఆకట్టుకుంది. అంతకుముందు రాకా సుధాకర్ రావు మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణకు యువత నడుం బిగించాలని కోరారు. హిందూ ఐక్యత ఆవశ్యకతను తన ప్రసంగంలో వివరించారు.

శ్రీమతి జగన్మోహిని పర్యవేక్షణలో సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ సామూహిక పారాయణ కార్యక్రమంలో దాదాపు నాలుగు వేల మంది పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య ఆకర్షణగా నిలిచిన పురాణపండ శ్రీనివాస్‌తో యువత సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. భాగ్యనగరంలో ఇటీవల జరిగిన భక్తి కార్యక్రమాలలో ఈ సమ్మేళనం విజయవంతమైందని, ఇంతటి బృహత్కార్యాన్ని నిర్వహించిన నిర్వాహక బృందాన్ని పలువురు అభినందించారు.
Go Back to Shorts
Hanuman Chalisa
Hyderabad
Hindu Maha Sammelan
Myhome Avatar Grounds
Devireddy Prabhakar Reddy
Puranapanda Srinivas
Raka Sudhakar Rao
Monika Reddy
Hinduism
Bhagyanagar

More Telugu News