ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సోమవారం తన 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. హైదరాబాద్‌ను గ్లోబల్ ఐటీ హబ్‌గా తీర్చిదిద్దింది చంద్రబాబేనని ఆయన కొనియాడారు.

చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అరవింద్ ఒక పోస్ట్ చేశారు. "1990లలోనే చంద్రబాబు స్పష్టమైన విజన్‌తో పనిచేశారు. రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్లను ప్రణాళికాబద్ధంగా విస్తరించి, తెలుగు యువతను ప్రపంచ ఐటీ రంగానికి పరిచయం చేశారు," అని అరవింద్ ప్రశంసించారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాలను ఆయన గుర్తుచేశారు.

హైదరాబాద్‌లో హైటెక్ సిటీ వంటి ప్రాజెక్టులతో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించి, లక్షలాది ఉద్యోగాలకు మార్గం సుగమం చేశారని తన పోస్టులో అరవింద్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వ పటిమ, దార్శనికత వల్లే హైదరాబాద్ నేడు ఈ స్థాయిలో ఉందని అభిప్రాయపడ్డారు.