భవిష్యత్తులో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నుంచి నోబెల్ బహుమతి గ్రహీతలు రావాలని భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ఆశాభావం వ్యక్తం చేశారు. వర్సిటీ 40వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విద్యా, వైద్య, సంక్షేమ, సాంస్కృతిక రంగాలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి దివంగత ఎన్టీ రామారావు అందించిన సేవలను ఆయన కొనియాడారు. దేశంలోనే తొలి హెల్త్ యూనివర్సిటీని స్థాపించడంలో ఎన్టీఆర్ చూపిన దూరదృష్టి ప్రశంసనీయమని అన్నారు. తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి తాగునీరు అందించిన ఆయన మానవతా దృక్పథాన్ని గుర్తుచేశారు.

ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో వికసిత భారత్ 2047 లక్ష్యానికి అనుగుణంగా గత 12 ఏళ్లలో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీలు, సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగిందని రాధాకృష్ణన్ తెలిపారు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు కొత్త పరిష్కారాలు కనుగొనేందుకు వర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ పరిశోధనల్లో రాణించాలని సూచించారు.

వైద్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీల ప్రాధాన్యం పెరుగుతున్నప్పటికీ, వైద్యులు మానవత్వాన్ని ఎన్నడూ మరువరాదని ఆయన హితవు పలికారు. రోగుల పట్ల కరుణ, మానవత్వం, ఆత్మీయత చూపడమే వైద్య వృత్తిలో అత్యంత ముఖ్యమని స్పష్టం చేశారు. సమాజంలో మాదకద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, దాని దుష్ప్రభావాలపై విస్తృత అవగాహన కల్పించేందుకు వైద్యులు, యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.