భారత్‌తో నేరుగా వాణిజ్యం చేయడంపై నిషేధం ఉన్నప్పటికీ పాకిస్థాన్‌కు భారత వస్తువులు భారీగా చేరుతున్నాయి. ఆశ్చర్యకరంగా 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్‌ నుంచి పాకిస్థాన్‌ చేసుకున్న దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 69 శాతం పెరిగాయి. దీంతో అసలు ఈ వస్తువులు పాకిస్థాన్‌కు ఎలా చేరుతున్నాయన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

డాన్‌ పత్రిక నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జూన్‌ మధ్య భారత్‌ నుంచి 61.74 మిలియన్‌ డాలర్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంది. మన కరెన్సీలో వీటి విలువ సుమారు రూ.5,876 కోట్లు. గత ఏడాది ఇదే కాలంలో దిగుమతుల విలువ 36.55 మిలియన్‌ డాలర్లు మాత్రమే. మరోవైపు, ఇదే సమయంలో పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు ఎలాంటి వస్తువుల దిగుమతులు నమోదు కాలేదు.

గత ఏడాది ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రదాడి తర్వాత భారత్‌-పాకిస్థాన్‌ మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాఘా-అట్టారీ సరిహద్దు మార్గంలో వాణిజ్యాన్ని నిలిపివేయడంతోపాటు, పాకిస్థాన్‌లో ఉత్పత్తి చేసిన లేదా అక్కడి నుంచి ఎగుమతి చేసిన వస్తువులను ప్రత్యక్షంగా, పరోక్షంగా దిగుమతి చేసుకోవడంపై భారత్‌ నిషేధం విధించింది. పాకిస్థాన్‌ కూడా భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసింది.

అయినా భారత వస్తువులు పాకిస్థాన్‌కు చేరుతుండటానికి మూడో దేశాలే మార్గంగా మారుతున్నాయని నిపుణులు భావిస్తున్నారు. దుబాయ్‌, సింగపూర్‌, కొలంబో వంటి కేంద్రాల ద్వారా వస్తువులను తరలించి, వాటి మూల దేశాన్ని వేరుగా చూపించే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే తాజాగా నమోదైన దిగుమతుల గణాంకాలు ఏ మార్గంలో వస్తువులు చేరాయన్న విషయాన్ని స్పష్టంగా వెల్లడించడం లేదు.

ఏ వస్తువులకు డిమాండ్‌?
భారత్‌ నుంచి పాకిస్థాన్‌కు ప్రధానంగా ఔషధాలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, పెట్రోలియం ఉత్పత్తులు, రసాయనాలు, రబ్బరు, కాఫీ, టీ, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలు వెళ్తున్నాయి. ముఖ్యంగా ఔషధాల తయారీకి అవసరమైన ముడి పదార్థాల కోసం పాకిస్థాన్‌కు భారత్‌ కీలక సరఫరాదారుగా ఉంది.

గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ (జీటీఆర్‌ఐ) అంచనా ప్రకారం.. మూడో దేశాల ద్వారా జరిగే అనధికారిక భారత ఎగుమతుల విలువ ఏడాదికి 10 బిలియన్‌ డాలర్ల వరకు ఉండొచ్చు. అయితే ఇది అంచనా మాత్రమే. నిషేధం ఉన్నప్పటికీ వాణిజ్యం ఎలా కొనసాగుతోందన్న దానిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య అధికారిక వాణిజ్యం దాదాపు నిలిచిపోయినా, భారత వస్తువులకు పాకిస్థాన్‌లో డిమాండ్‌ కొనసాగుతోందని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. నిషేధాలను తప్పించుకుని వస్తువులు చేరుతున్నాయా? అలా అయితే వాటిని అడ్డుకోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అన్నది ఇప్పుడు కీలకంగా మారింది.