ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వ నవరత్న సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), శ్రీ సత్యసాయి జిల్లాలో భారీ రక్షణ రంగ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ. 2,500 కోట్ల మేర పెట్టుబడి పెట్టనుంది.

ఈ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం సుమారు 914 ఎకరాల భూమిని కేటాయించింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపొందే ఈ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్స్ కాంప్లెక్స్ ద్వారా స్థానిక యువతకు ప్రత్యక్షంగా 800 ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. దీనితో పాటు అనుబంధ పరిశ్రమల ఏర్పాటు ద్వారా పరోక్షంగా మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు.

ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. రాయలసీమలో అత్యాధునిక రక్షణ రంగ తయారీ పరిశ్రమను నెలకొల్పుతున్నామని, దీనివల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. 'చెప్పాం.. చేస్తున్నాం!' అంటూ ఈ ప్రాజెక్టు పురోగతిపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.