పశ్చిమాసియాలో ఉద్రిక్తతల చల్లార్పు దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులతో కాల్పుల విరమణ ఒప్పందం కోసం సౌదీ అరేబియా భారీ ప్రతిపాదన చేసినట్లు సంచలన కథనాలు వెలువడుతున్నాయి. 

తమ దేశంపై దాడులను నిలిపివేస్తే, హౌతీలకు 1 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 9,507కోట్లు) ఆర్థిక సాయం అందిస్తామని సౌదీ ప్రతిపాదించినట్లు గల్ఫ్ దౌత్య వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ శాంతి చర్చలకు ఇరాన్ మధ్యవర్తిత్వం వహించడం, సమావేశం టెహ్రాన్‌లో జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ ఇటీవలే టెహ్రాన్‌కు వెళ్లి ఈ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్‌తో పాటు తుర్కియే నిఘా విభాగాధిపతి ఇబ్రహీం కాలిన్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వంటి కీలక ప్రాంతీయ నేతలు కూడా పాల్గొన్నట్లు సమాచారం. 

సౌదీ మంత్రి తన వెంట సైనిక రవాణా విమానంలో 1 బిలియన్ డాలర్ల నగదును టెహ్రాన్‌కు తీసుకొచ్చారని ఒక దౌత్యవేత్త చెప్పినప్పటికీ, సౌదీ అధికారులు మాత్రం నిధుల బదిలీని ధ్రువీకరించలేదు.

సౌదీ అరేబియాలోని విమానాశ్రయాలు, చమురు క్షేత్రాలపై హౌతీలు చేస్తున్న దాడులు, హ‌ర్మూజ్ జలసంధిలో సృష్టిస్తున్న ఆటంకాల నేపథ్యంలో శాంతిని నెలకొల్పేందుకు ఇరాన్ ఈ మధ్యవర్తిత్వానికి ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. ఖతార్, పాకిస్థాన్ చేస్తున్న శాంతి ప్రయత్నాలకు మద్దతుగా, ఉద్రిక్తతలను తగ్గించేందుకే ఈ పర్యటన జరిగిందని సౌదీ విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

మూడేళ్ల క్రితం కుదిరిన ఒక అవగాహనను అమలు చేయడంలోనే ప్రధాన సమస్య ఉందని సౌదీ అధికారి ఒకరు సూచించారు. ఆ ఒప్పందం ప్రకారం.. సౌదీపై దాడులు ఆపినందుకు ప్రతిగా, హౌతీల నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో జీతాలు, మౌలిక సదుపాయాల కోసం రియాద్ ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది.