స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో తమ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను పోలీసులు అరికట్టడంలో విఫలమయ్యారంటూ అనంతపురం జిల్లా పోలీసులపై తాడిపత్రి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుకు నిరసనగా ఆయన తన అనుచరులతో కలిసి నిన్న అర్ధరాత్రి వరకు తాడిపత్రి రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట మంచం వేసుకుని బైఠాయించారు. ఈ ఘటనతో తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

శింగనమల నియోజకవర్గం, యల్లనూరు మండలంలోని తిమ్మంపల్లి, కొడవండ్లపల్లి గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి నాయకత్వంలో వైసీపీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి నిరసనతో అప్రమత్తమైన పోలీసులు... ఆయనకు నచ్చజెప్పారు. దీంతో ప్రభాకర్ రెడ్డి తన నిరసనను విరమించి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ఈ పరిణామాల మధ్య రాప్తాడు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ... జిల్లా పోలీసులు టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారి పనితీరు సరిగా లేదని విమర్శించారు.