పల్నాడు జిల్లా చిలకలూరిపేట పురపాలికలో వైసీపీకి ఊహించని షాక్ తగిలింది. మున్సిపల్ ఛైర్‌పర్సన్ పదవికి వైసీపీ తరఫున బరిలో ఉన్న అభ్యర్థి కారెమూన్ షేక్, ఆదివారం రాత్రి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సమక్షంలో ఆమె, తన భర్త యూసుఫ్ అలీతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం తుది అభ్యర్థుల జాబితాను విడుదల చేయగా, ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. చిలకలూరిపేట మున్సిపాలిటీలో కూటమి (జనసేన) తరఫున తోట రాజరాజేశ్వరి, వైసీపీ తరఫున కారెమూన్ షేక్ ప్రధాన అభ్యర్థులుగా ఉన్నారు.

ఈ సందర్భంగా కారెమూన్ షేక్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ సహకారంతో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితురాలై టీడీపీలో చేరినట్లు తెలిపారు. ఇకపై కూటమి అభ్యర్థి గెలుపు కోసం తాను ప్రచారం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి తోట రాజరాజేశ్వరి, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ తోట రాజారమేష్ కూడా పాల్గొన్నారు.