టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని నాయకత్వ పటిమపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆటను సహజసిద్ధంగా అంచనా వేయగలగడం, ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటమే ధోని అసలైన "సూపర్ పవర్" అని అభివర్ణించాడు. తన కెప్టెన్సీలో కూడా ధోని నుంచి ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలనుకుంటున్నట్లు డుప్లెసిస్ తెలిపారు.

ఇటీవల 'ప్రఖర్ గుప్తా పాడ్‌కాస్ట్'లో మాట్లాడిన డుప్లెసిస్, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) తరఫున ధోని కెప్టెన్సీలో ఆడిన రోజులను గుర్తుచేసుకున్నాడు. తాను తొమ్మిది సీజన్ల పాటు సీఎస్‌కేలో ఉన్నానని, అందులో మూడుసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నానని చెప్పాడు.

"ధోనికి మైదానంలో ఆటపై అద్భుతమైన అవగాహన ఉంది. మ్యాచ్‌కు ముందు ఎక్కువగా ప్రణాళికలు వేసుకోవడానికి ఇష్టపడడు. మ్యాచ్ సమయంలో తన సహజ జ్ఞానంతోనే నిర్ణయాలు తీసుకుంటాడు. అదే అతని సూపర్ పవర్. ఆటను, ఆటగాళ్లను అర్థం చేసుకుంటూనే చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఆ ప్రశాంతతను, ఆటను చదివే నైపుణ్యాన్ని అతని నుంచి స్వీకరించి నా కెప్టెన్సీలో అమలు చేయాలనుకుంటున్నాను" అని డుప్లెసిస్ వివరించాడు.

చెన్నైతో సుదీర్ఘ అనుబంధం తర్వాత ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు డుప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. ధోని నాయకత్వంలో నేర్చుకున్న పాఠాలు తన కెప్టెన్సీకి ఎంతో ఉపయోగపడుతున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.