Ramchander Rao: మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే: రాంచందర్ రావు

Ramchander Rao on Moosi River Project BJPs Stand Clear

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము మూసీ నది శుద్ధికి లేదా అభివృద్ధికి ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ అభివృద్ధి పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇళ్లను కూల్చడాన్ని మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన విమర్శలకు కౌంటర్‌గా మాట్లాడిన ఆయన, మూసీ నది హైదరాబాద్ నుంచి కృష్ణానదిలో కలిసే వరకు పరిశుభ్రంగా ఉండాలని బీజేపీ కోరుకుంటోందని తెలిపారు. అయితే, ‘గాంధీ సరోవర్’ వంటి ప్రాజెక్టుల కోసం మధుబన్ పార్క్, విఘ్నేశ్వర్ కాలనీ వంటి ప్రాంతాల్లో చట్టబద్ధంగా నిర్మించుకున్న ఇళ్లను కూల్చడం అంగీకారయోగ్యం కాదని, ఇళ్లకు నష్టం కలగకుండానే నదిని శుద్ధి చేయవచ్చని ఆయన సూచించారు.


గుజరాత్‌లోని సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఉదాహరణగా తీసుకునే వారు, అక్కడ నరేంద్ర మోదీ అనుసరించిన విధానాలను గమనించాలని రాంచందర్ రావు హితవు పలికారు. అక్కడ సుమారు 4 వేల కుటుంబాలకు ముందుగా పునరావాసం కల్పించి, ప్రత్యామ్నాయ గృహాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టారని గుర్తుచేశారు. ప్రజల జీవితాలను దెబ్బతీయకుండా చేసేదే నిజమైన అభివృద్ధి అని అన్నారు. గాంధీ విగ్రహాన్ని ఎంత ఎత్తులో నిర్మించినా తమకు అభ్యంతరం లేదని, కానీ పేదల జీవనాధారాన్ని దెబ్బతీస్తే మాత్రం పోరాటం తప్పదని హెచ్చరించారు.


మరోవైపు, దేశంలో ఇంధన కొరతపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. అంతర్జాతీయంగా యుద్ధ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి జైశంకర్ ఇప్పటికే సంబంధిత దేశాలతో మాట్లాడి చమురు సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. భారతదేశం కేవలం ఒక ప్రాంతంపైనే ఆధారపడదని, 40 శాతం ముడి చమురు ఇతర దేశాల నుంచి వస్తుందని చెప్పారు. రవాణాలో స్వల్ప ఆలస్యాలు ఉండొచ్చని, కానీ గ్యాస్, పెట్రోల్ కొరత మాత్రం ఉండదని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చిందని, ప్రజల్లో అనవసర భయాందోళనలు సృష్టించడం సరికాదని ఆయన పేర్కొన్నారు.

Ramchander Rao
Moosi River
BJP
Telangana
Riverfront Project
Sabarmati Riverfront
Pannam Prabhakar
Hyderabad
Narendra Modi
Gujarat

More Telugu News