అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీకి కీలక విజయాలు దక్కిన వేళ.. ఆ పార్టీ యువ నాయకుడు జాన్‌ ఒసాఫ్‌ పేరు ఒక్కసారిగా మార్మోగుతోంది. జార్జియా రాష్ట్రం నుంచి సెనేట్‌కు మరోసారి ఎన్నికైన ఆయన.. 2028 అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాట్ల తరఫున బరిలోకి దిగవచ్చనే చర్చ మొదలైంది. మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామాతో పోలికలు రావడం ఈ ఆసక్తిని మరింత పెంచుతోంది.

39 ఏళ్ల ఒసాఫ్‌ 2021లో తొలిసారి జార్జియా నుంచి సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పటికి ఆయన వయసు 33 ఏళ్లు మాత్రమే. స్వల్ప ఆధిక్యంతో గెలవడంతో రాజకీయ విశ్లేషకులు ఆయనను ‘అనుకోకుండా సెనేటర్‌ అయిన వ్యక్తి’గా అభివర్ణించారు. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు అదే రాష్ట్రంలో తిరిగి విజయం సాధించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌కు మద్దతు లభించిన జార్జియాలో ఒసాఫ్‌ గెలవడం విశేషం. రిపబ్లికన్‌ అభ్యర్థి మైక్‌ కాలిన్స్‌ను ఓడించి తన స్థానాన్ని నిలబెట్టుకున్నారు.

ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ పాలనపై ఒసాఫ్‌ తీవ్ర విమర్శలు చేశారు. అధ్యక్షుడు, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని విమర్శించారు. ఎన్నికల ఫలితాల అనంతరం అట్లాంటాలో జరిగిన సభలోనూ ట్రంప్‌ పాలనపై ఘాటుగా స్పందించారు. అమెరికా ప్రజలు అవినీతి, అసమర్థతను తిరస్కరించారని వ్యాఖ్యానించారు.

ఒసాఫ్‌ ప్రసంగ శైలి, ప్రజలను ఆకట్టుకునే తీరు, యువ నాయకుడిగా ఆయనకున్న ఇమేజ్‌ ఒబామాను గుర్తు చేస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఒబామా కూడా ఎన్నికలకు ముందు ఒసాఫ్‌కు మద్దతుగా ప్రచారం చేశారు. ఆయన తన రాజకీయ గురువు జాన్‌ లూయిస్‌ నుంచి ప్రజాసేవలోని విలువలు నేర్చుకున్నారని ప్రశంసించారు.

అయితే, 2028లో అధ్యక్ష పదవికి పోటీ చేసే ఆలోచన లేదని ఒసాఫ్‌ గతంలో స్పష్టం చేశారు. సెనేట్‌ ఎన్నికల్లో గెలిస్తే పూర్తి ఆరేళ్ల పదవీకాలం కొనసాగిస్తానని కూడా చెప్పారు. అయినప్పటికీ తాజా విజయం తర్వాత ఆయన పేరుపై చర్చ ఊపందుకుంది. డెమోక్రాట్లలో భవిష్యత్తు నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే అధ్యక్ష అభ్యర్థిత్వంపై ఆయన నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.