Team India: టీమిండియా ప్రాక్టీస్ పై చంద్రగ్రహణం ఎఫెక్ట్!

Team India Practice Affected by Lunar Eclipse Before Semi Final
  • టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో ఇంగ్లండ్‌తో భారత్ పోరు
  • గురువారం వాంఖడే స్టేడియంలో కీలక మ్యాచ్
  • చంద్రగ్రహణం కారణంగా టీమిండియా ప్రాక్టీస్ వాయిదా
  • గ్రహణం వీడే వరకు సాధన అశుభమని ఆటగాళ్ల నమ్మకం
టీ20 ప్రపంచకప్ 2026లో మరో కీలక సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న సెమీ ఫైనల్‌లో భారత్, ఇంగ్లండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్‌కు ముందు మంగళవారం చంద్రగ్రహణం కారణంగా టీమిండియా తన ప్రాక్టీస్‌ను తాత్కాలికంగా వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం సాయంత్రం 6 గంటలకు మొదలుకావాల్సిన ప్రాక్టీస్ సెషన్‌ను జట్టు యాజమాన్యం గంటపాటు వాయిదా వేసింది. సాయంత్రం 6:47 గంటలకు చంద్రగ్రహణం ముగియనుండటంతో, అంతకుముందు సాధన చేయడం అశుభమని కొందరు ఆటగాళ్లు భావించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. దీంతో గ్రహణం వీడిన తర్వాతే జట్టు మైదానంలోకి అడుగుపెట్టింది. 

ప్రస్తుత ప్రపంచకప్ టోర్నీలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ గంభీర్ సహా పలువురు ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆధ్యాత్మికతకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కీలక మ్యాచ్‌లు జరిగే నగరాల్లోని ప్రముఖ ఆలయాలను సందర్శించడం వంటివి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చంద్రగ్రహణం సెంటిమెంట్‌ను కూడా పాటించడం చర్చనీయాంశంగా మారింది. 

2024 టీ20 ప్రపంచకప్‌లోనూ భారత్ సెమీ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ను ఓడించి, ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై గెలిచి ఛాంపియన్‌గా నిలిచింది. అదే ఫలితాన్ని ఈసారి కూడా పునరావృతం చేసి, ఫైనల్‌కు దూసుకెళ్లాలని టీమిండియా, యావత్ భారత క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
 
 
Team India
T20 World Cup 2026
Chandra Grahanam
India vs England
Semi Final
Wankhede Stadium
Suryakumar Yadav
Gautam Gambhir
Indian Cricket Team

More Telugu News