రాష్ట్రంలో జరుగుతున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే వైసీపీ అరాచకాలకు, హింసకు పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో ఆరోపించారు. గొడ్డలి పార్టీ అబద్ధాలు, దౌర్జన్యాలతో ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసి గెలవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. గురువారం మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో వైసీపీ నేతలు ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని అన్నారు.

ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కూటమికి సుమారు 95 శాతం స్ట్రైక్ రేట్‌తో ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని పల్లా శ్రీనివాసరావు గుర్తుచేశారు. అదే ఫలితం ఈ ఎన్నికల్లోనూ పునరావృతం అవుతుందనే భయంతోనే జగన్ హింసాత్మక మార్గాలను ఎంచుకున్నారని ఆయన దుయ్యబట్టారు. "పులివెందులలోని ఎర్రిపల్లిలో బాంబు దాడులతో ఓటర్లను భయపెట్టే ప్రయత్నాలు చేయడమే ఇందుకు నిదర్శనం. రాష్ట్రవ్యాప్తంగా ఓటింగ్ శాతం ప్రశాంతంగా నమోదవుతుంటే, కడపలో తక్కువగా ఉండటానికి వైసీపీ కుట్రలే కారణం" అని ఆయన స్పష్టం చేశారు. కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, జగన్ కుటుంబ సభ్యులు నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ బూత్‌లలోకి ప్రవేశిస్తూ ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలోని పలుచోట్ల వైసీపీ అరాచకాలకు పాల్పడుతోందని పల్లా ఉదాహరణలతో వివరించారు. కుప్పంలో బయటి ప్రాంతాల నుంచి రౌడీలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించే ప్రయత్నం చేస్తున్నారని, తిరుపతిలో గతంలో మాదిరిగానే ఆధార్ కార్డులు మార్చి నకిలీ ఓటర్లతో ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించారు. రామచంద్రపురంలో ఓటర్లకు డబ్బు పంచి బలవంతం చేయడం, జమ్మలమడుగులో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కుమారుడి దౌర్జన్యం, రైల్వే కోడూరు, అనంతపురంలో పెట్రోల్ బాంబుల దాడులు వంటి సంఘటనలు వైసీపీ అరాచక విధానాన్ని తెలియజేస్తున్నాయని అన్నారు.

"రాష్ట్రమంతా ఎన్నికలు స్వేచ్ఛగా జరుగుతుంటే పులివెందుల వంటి ప్రాంతాల్లోనే గొడవలు ఎందుకు జరుగుతున్నాయో ప్రజలు ఆలోచించాలి. ఇది రాజకీయమా లేక రౌడీజమా?" అని పల్లా శ్రీనివాసరావు నిలదీశారు. పులివెందులలో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేయడానికి వస్తుంటే పెట్రోల్ బాంబులు వేయడం, బూత్ క్యాప్చరింగ్ వంటి దుర్మార్గపు చర్యలకు వైసీపీ పాల్పడుతోందని మండిపడ్డారు.

కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు స్వేచ్ఛగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని పల్లా తెలిపారు. జగన్ ఇప్పటికైనా దుష్ప్రచారాలు, హింసా రాజకీయాలు మానుకుని ప్రజా తీర్పును గౌరవించాలని హితవు పలికారు. విద్వేషం, హింస ద్వారా గెలవాలనుకుంటే రాయలసీమ ప్రజలతో సహా రాష్ట్ర ప్రజానీకం ఎవరూ సహించరని హెచ్చరించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.