భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. టెస్ట్ క్రికెట్‌లో తన అత్యధిక పరుగుల రికార్డుకు రూట్ చేరువ అవుతున్న నేపథ్యంలో అతని ప్రతిభను తాను 2012లోనే గుర్తించానని సచిన్ అన్నాడు. రెడ్డిట్‌లో జరిగిన 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో అభిమానులతో ముచ్చటించిన సచిన్, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

టెస్ట్ క్రికెట్ చరిత్రలో సచిన్ 200 మ్యాచ్‌లలో 15,921 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. జో రూట్ 169 మ్యాచ్‌లలో 14,278 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సచిన్ రికార్డును అధిగమించడానికి రూట్‌కు ఇంకా 1,643 పరుగులు అవసరం. ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు సచిన్ స్పందిస్తూ.. "నేను రూట్‌ను ఎప్పుడూ గొప్ప ఆటగాడిగానే భావిస్తాను. అతను తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడే భవిష్యత్తులో ఒక పెద్ద స్టార్ అవుతాడని నాకు స్పష్టంగా అర్థమైంది!" అని వివరించాడు. 

2012లో నాగ్‌పూర్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌తో రూట్ టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచ్‌లో సచిన్ కూడా భారత జట్టులో సభ్యుడు కావడం విశేషం. ఆ మ్యాచ్‌లో రూట్ మొదటి ఇన్నింగ్స్‌లో 73 పరుగులు చేశాడు. 

ఇదే సెషన్‌లో తనకు ఇష్టమైన విదేశీ బ్యాటర్ల గురించి అడగ్గా, సచిన్ ఇంగ్లండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, జో రూట్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన స్టీవ్ స్మిత్ పేర్లను వెల్లడించాడు.

వన్డే ఫార్మాట్‌పై సచిన్ కీలక సూచనలు 
ఇక, వన్డే అంతర్జాతీయ ఫార్మాట్‌లో మార్పులు తీసుకురావాలనే తన పాత సూచనను సచిన్ మరోసారి పునరుద్ఘాటించాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ను ఒక్కో జట్టుకు 25 ఓవర్ల చొప్పున రెండు వేర్వేరు ఇన్నింగ్స్‌లుగా విభజించాలని సూచించాడు. "నా సూచన చాలా సులభం. 50 ఓవర్లను రెండు 25 ఓవర్ల ఇన్నింగ్స్‌లుగా విభజించాలి. 

కానీ, మొత్తం 50 ఓవర్లకు 10 వికెట్లు అలాగే ఉంచాలి. ఒకే బంతిని ఉపయోగించాలి. దీనివల్ల బ్యాట్, బాల్ మధ్య పోటీ స‌మంగా ఉంటుంది. మంచు ప్రభావం వల్ల ఒకే జట్టుకు అనుకూలంగా మారే పరిస్థితి ఉండదు. బౌలర్లు కనుమరుగు కాకముందే మనం ఏదైనా చేయాలి" అని సచిన్ తన ప్రతిపాదనను వివరించాడు. ఈ మార్పుతో ఆట రెండు జట్లకు సమతుల్యంగా మారుతుందని అభిప్రాయపడ్డాడు.