కామారెడ్డిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత... ముట్టడికి కాంగ్రెస్ యత్నం

Katipally Venkata Ramana Reddy Tensions Rise at Kamareddy MLA Camp Office
షార్ట్స్‌లో చూడండి
బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకుడు గీరెడ్డి మహేందర్ రెడ్డి కామారెడ్డిలోని ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఎమ్మెల్యేకు మద్దతుగా బీజేపీ కార్యకర్తలు తరలి వచ్చారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి కారును బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.

గత కొన్ని రోజులుగా వెంకటరమణారెడ్డి, షబ్బీర్ అలీలు కామారెడ్డి అభివృద్ధి, అవినీతిపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. ప్రభుత్వ కాలేజీ భూములు, శిశుమందిర్ పాఠశాల, అరోరా కాలేజీ విషయంలో కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేయడంతో, తాను చర్చకు సిద్ధమని కాటిపల్లి వెంకటరమణారెడ్డి ప్రకటించారు. కామారెడ్డిలో ఏం జరిగిందో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. అందుకే తాను చర్చకు వస్తానని చెప్పారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

నేనే తేల్చుకుంటాను: కాటిపల్లి వెంకటరమణారెడ్డి

బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. క్యాంపు కార్యాలయానికి లేదా శిశుమందిర్ పాఠశాల వద్దకు ఎవరూ రావొద్దని విజ్ఞప్తి చేశారు. తన కుటుంబంపై కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేశారని, కాబట్టి తానే తేల్చుకుంటానని అన్నారు. కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు.
Go Back to Shorts
Katipally Venkata Ramana Reddy
Kamareddy
Shabbir Ali
Congress
BJP
Telangana Politics
MLA Camp Office

More Telugu News