Bandi Sanjay: బండి సంజయ్ వారియర్ అర్జునుడి పాత్రకు ఫిట్ అవుతారు: నిజామాబాద్ ఎంపీ అరవింద్

Bandi Sanjay Fits Warrior Arjun Role Says MP Aravind
  • రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రభుత్వమేమీ కాదన్న ఎంపీ
  • కార్పొరేటర్లను కాంగ్రెస్ బలవంతంగా ఎత్తుకెళితే బీఆర్ఎస్‌కు పట్టిన గతే పడుతుందని హెచ్చరిక
  • ముఖ్యమంత్రిని ప్రజలు ఇప్పటికే ఛీకొడుతున్నారన్న ధర్మపురి అరవింద్
బండి సంజయ్ ఒక వారియర్ అని, ఆయన అర్జునుడి పాత్రకు ఫిట్ అవుతారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ బలమైన ప్రభుత్వమేమీ కాదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన స్థాయిలో ఏమీ లేరని వ్యాఖ్యానించారు. మున్సిపల్ వార్డు సభ్యులు, కార్పొరేటర్లను బలవంతంగా ఎత్తుకెళ్తే బీఆర్ఎస్‌కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రజలు ఇప్పటికే ఛీకొడుతున్నారని, ఇప్పుడు కార్పొరేటర్లను ఎత్తుకెళితే మరింత ఛీకొడతారని అన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ ఫలితాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకున్నామని అన్నారు. తన పార్లమెంట్ పరిధిలో కూడా బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లను గెలుచుకున్నామని ధర్మపురి అరవింద్ వెల్లడించారు. కాంగ్రెస్ లౌకిక వాద పార్టీ కాదని, ఓ బ్రోకర్ పార్టీ అని దుయ్యబట్టారు.

ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. తమ పార్టీ అభ్యర్థులను పోలింగ్ బూత్‌ల నుంచి పంపించినందుకు నేనే వారిపై కేసు పెట్టాలని ఆయన అన్నారు. కానీ పోలీసులే తనపై కేసు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పోలీసులు చెప్పారని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లను ఎత్తుకెళ్లడానికి కాంగ్రెస్ పార్టీకి పోలీసులు సహకరిస్తున్నారని విమర్శించారు.

రాజకీయాలను భ్రష్టు పట్టించారనే కేసీఆర్‌ను తెలంగాణ ప్రజలు ఓడించారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే దారిలో నడుస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో హుందాతనం ముఖ్యమని అన్నారు. ఎవరికి మద్దతు ఇవ్వాలనేది కార్పోరేటర్లు నిర్ణయించుకుంటారని తెలిపారు. కానీ బలవంతంగా ఎత్తుకెళ్లడం సరికాదని అన్నారు. కరీంనగర్‌లోను బండి సంజయ్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటిందని ప్రశంసించారు.
Bandi Sanjay
Dharmapuri Aravind
Nizamabad
Telangana Politics
Revanth Reddy
BJP
BRS
Congress Party

More Telugu News