ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా దూసుకెళ్తున్న వేళ, దాని ప్రభావం ఇప్పుడు నేరుగా సామాన్యుడి జేబుపై పడనుంది. కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చేదువార్త. రానున్న రోజుల్లో ఫోన్ల ధరలు, ముఖ్యంగా బడ్జెట్ ఆండ్రాయిడ్ ఫోన్ల ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ పెరుగుదల ఏకంగా 30% వరకు ఉండొచ్చని ప్రముఖ గ్లోబల్ రీసెర్చ్ సంస్థ జెఫరీస్ తన తాజా నివేదికలో హెచ్చరించింది.

ఏఐ టెక్నాలజీకి గుండెలాంటి ప్రాసెసర్లు, మెమరీ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడటమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. జెమిని, చాట్‌జీపీటీ వంటి ఏఐ అప్లికేషన్ల కోసం టెక్ దిగ్గజాలు భారీ డేటా సెంటర్లను నిర్మిస్తున్నాయి. దీనికోసం మార్కెట్‌లోని మెమరీ చిప్‌లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తుండటంతో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలకు తీవ్ర కొరత ఏర్పడింది. ఫలితంగా, గతంలో 20 డాలర్లు (సుమారు రూ.1,680) పలికిన ఒక మెమరీ యూనిట్ ధర, ఇప్పుడు మూడు రెట్లు పెరిగి 60 నుంచి 65 డాలర్లకు (సుమారు రూ.5,000) చేరింది.

ఈ ధరల పెరుగుదల ప్రభావం ముఖ్యంగా రూ.16,000 లోపు లభించే బడ్జెట్ ఫోన్లపైనే ఎక్కువగా పడనుంది. ఎందుకంటే, ఈ ఫోన్ల తయారీ ఖర్చులో దాదాపు 60% మెమరీ చిప్‌లదే ఉంటుంది. దీంతో పెరిగిన భారాన్ని కంపెనీలు తప్పనిసరిగా వినియోగదారులపై మోపేందుకు సిద్ధమవుతున్నాయి. ధరలు పెరగడంతో చాలా మంది కొత్త ఫోన్ల కొనుగోలును వాయిదా వేసుకోవడం లేదా సెకండ్ హ్యాండ్ (రీఫర్బిష్డ్) ఫోన్ల వైపు మొగ్గు చూపవచ్చని జెఫరీస్ అంచనా వేసింది.

ఈ పరిణామాలతో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోనూ గణనీయమైన మార్పులు రానున్నాయి. 200 డాలర్ల లోపు ఫోన్ల మార్కెట్ వాటా 42% నుంచి 24%కి పడిపోనుండగా, 600 డాలర్ల కంటే ఎక్కువ విలువైన ప్రీమియం ఫోన్ల వాటా 29% నుంచి 38%కి పెరుగుతుందని నివేదిక తెలిపింది. తయారీ వ్యయాన్ని తగ్గించుకోవడానికి కొన్ని కంపెనీలు కొత్త ఫోన్లలో పాత తరం ప్రాసెసర్లను వాడే అవకాశం ఉందని, అలాగే తక్కువ ధర మోడళ్ల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్నాయని పేర్కొంది. ఏఐ కంపెనీలు 2027 నాటికి సుమారు 1.5 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నందున, మెమరీ చిప్‌ల ధరలు 2027 మధ్యకాలం వరకు గరిష్ఠ స్థాయిలోనే కొనసాగవచ్చని జెఫరీస్ స్పష్టం చేసింది.