Anki Bhanu Prakash: హైదరాబాద్‌లో ప్రేమోన్మాది ఘాతుకం: యువతి గోర్లు పీకి, చిత్రహింసలు

Hyderabad Techie Arrested for Brutal Attack on Lover
  • ప్రేమ పేరుతో యువతిపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దారుణం
  • హైదరాబాద్ సోమాజిగూడలో వెలుగులోకి వచ్చిన ఘటన
  • గదిలో బంధించి లైంగిక దాడికి యత్నం
  • ఎదురు తిరగడంతో కత్తెరతో వేలి గోళ్లు పీకేసిన నిందితుడు
  • పోలీసులకు చెబితే యాసిడ్ పోస్తానని బెదిరింపులు
  • నిందితుడు భానుప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు
ప్రేమించిన యువతిపై ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రాక్షసంగా ప్రవర్తించాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లొంగకపోవడంతో ఆమెను గదిలో బంధించి అమానుషంగా దాడికి పాల్పడ్డాడు. కత్తెరతో ఆమె వేలి గోళ్లు పీకేసి, ప్రైవేట్ భాగాలపై దాడి చేసి చిత్రహింసలకు గురిచేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లోని సోమాజిగూడలో చోటుచేసుకుంది. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా మూసాపేటకు చెందిన అంకి భానుప్రకాశ్ (23) హైదరాబాద్‌లోని బీఎన్‌రెడ్డి నగర్‌లో నివసిస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. సోమాజిగూడకు చెందిన ఓ యువతి ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు మధ్యలోనే ఆపేసి, మణికొండలోని ఓ సంస్థలో పనిచేస్తోంది. ఈ క్రమంలో వారిద్దరికీ పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో వారి బంధం మరింత బలపడింది.

అయితే, కొద్దికాలంగా భానుప్రకాశ్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఈ నెల 26న రాత్రి నేరుగా ఆమె ఫ్లాట్‌కు వెళ్లి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను గదిలో బంధించి లైంగిక దాడికి ప్రయత్నించాడు. బాధితురాలు తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన భానుప్రకాశ్ కిరాతకంగా ప్రవర్తించాడు. కత్తెర తీసుకుని ఆమె చేతి వేలి గోళ్లను పీకేశాడు. అంతటితో ఆగకుండా ప్రైవేట్ భాగాలపై దాడి చేసి, గొంతు పిసికి చంపేందుకు యత్నించాడు. ఈ విషయం పోలీసులకు చెబితే యాసిడ్ పోసి చంపుతానని తీవ్రంగా హెచ్చరించాడు.

అతడి చెర నుంచి బయటపడిన యువతి, ధైర్యం చేసి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడు అంకి భానుప్రకాశ్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ప్రేమ పేరుతో ఓ టెక్కీ ఇంతటి ఘాతుకానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.
Anki Bhanu Prakash
Hyderabad crime
ప్రేమ
stalker
గోర్లు
torture
Somajiguda
cyberabad police
crime news
acid attack threat

More Telugu News