కొన్ని నెలలుగా కొనసాగుతున్న ఊహాగానాలకు తెరదించుతూ ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. ఐపీఎల్ 2027 సీజన్‌కు గాను జట్టు కెప్టెన్‌గా రోహిత్ శర్మను నియమించినట్లు నిన్న‌ అధికారికంగా వెల్లడించింది. దీంతో ముంబై జట్టు పగ్గాలు మళ్లీ 'హిట్ మ్యాన్' చేతికి వచ్చినట్లయింది.

ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ అవ్వడం, కీరన్ పొలార్డ్‌ను హెడ్ కోచ్‌గా నియమించడం వంటి పరిణామాల నేపథ్యంలో కెప్టెన్ ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. పేసర్ అర్ష్‌దీప్ సింగ్‌తో ట్రేడింగ్‌లో భాగంగా హార్దిక్ పంజాబ్‌కు వెళ్లడంతో ముంబై యాజమాన్యం తిరిగి రోహిత్ వైపే మొగ్గు చూపింది.

నిజానికి, కెప్టెన్సీ రేసులో సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, తిలక్ వర్మ పేర్లు కూడా వినిపించాయి. టీ20 ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్‌గా సూర్యకుమార్‌కు మంచి అవకాశాలు ఉన్నట్లు భావించారు. అయితే, రోహిత్‌ను కెప్టెన్‌గా ప్రకటించిన తర్వాత సూర్యకుమార్ చాలా హుందాగా స్పందించాడు.

తొలుత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్లూ హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసిన సూర్య, ఆ తర్వాత మరో ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. రోహిత్ ఫొటోను పంచుకుంటూ.. "నాయకుడు. సోదరుడు. మార్గదర్శి. పల్టాన్, సీట్ బెల్టులు బిగించుకోండి" అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ అభిమానుల మనసులను గెలుచుకుంటోంది. గతంలో రోహిత్ శర్మ సారథ్యంలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలిచిన విష‌యం తెలిసిందే.