కొలంబియాలోని ప్రముఖ పర్యాటక నగరమైన కార్టజీనాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నగదు తరలిస్తున్న ఓ సాయుధ వాహనాన్ని దోచుకునే ప్రయత్నం విఫలమవ్వడంతో, దుండగులు సమీపంలోని సూపర్ మార్కెట్‌లోకి చొరబడి సుమారు 30 మందిని బందీలుగా చేసుకున్నారు. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు రంగంలోకి దిగి జరిపిన చర్చల అనంతరం, ఇప్పటివరకు 10 మంది క్షేమంగా విడుదలయ్యారు.

కార్టజీనాలోని లా కాస్టెల్లానా ప్రాంతంలో మంగళవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ సాయుధ వాహనం నుంచి నగదు దోచుకునేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది పానిక్ బటన్ నొక్కడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో దుండగులు సమీపంలోని 'ఎక్సిటో' సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించి, అక్కడి సిబ్బందిని, వినియోగదారులను బందీలుగా పట్టుకున్నారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సైనిక ప్రత్యేక బలగాలు సూపర్ మార్కెట్‌ను చుట్టుముట్టాయి. పరిసర భవనాలపై స్నైపర్లను సైతం మోహరించారు. అధికారుల చర్చల ఫలితంగా.. దుండగులు తొలుత ఐదుగురు వృద్ధ మహిళలను, ఆ తర్వాత మరో ఐదుగురిని విడుదల చేశారు. ఇంకా సుమారు 20 మంది వారి చెరలోనే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనపై కొలంబియా అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా స్పందిస్తూ.. వీరు సాధారణ నేరస్థులే తప్ప, ఉగ్రవాదులు కాదని స్పష్టం చేశారు. "బందీలకు న్యాయం జరుగుతుంది.. కానీ నేరస్థులకు అంత మంచి జరుగుతుందని నేను అనుకోను" అని ఆయన వ్యాఖ్యానించారు. మిగిలిన బందీలను సురక్షితంగా విడిపించేందుకు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కార్టజీనా విమానాశ్రయంలో విమాన రాకపోకలను కొద్దిసేపు నిలిపివేశారు.