పదేళ్ల ప్రాయంలోనే ఓ భారతీయ బాలిక అసాధారణ ప్రతిభ కనబరిచి ప్రపంచ రికార్డులను సృష్టించింది. కర్ణాటకకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని ఇరా ఆదిత్య రౌత్, ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన 'క్వాలిఫైడ్ స్కూబా డైవర్‌'గా చరిత్ర సృష్టించింది. అండమాన్ నికోబార్ దీవుల్లోని షహీద్ ద్వీపంలో అక్టోబర్ 18న ఆమె ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

స్కూబా డైవింగ్‌లో అర్హత సాధించడమే కాకుండా, ఒకే రోజులో మరో ఐదు రికార్డులతో కలిపి మొత్తం ఆరు రికార్డులను ఆమె తన పేరిట నమోదు చేసుకుంది. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇరాను 'ప్రీ-టీన్' విభాగంలో అతి పిన్న వయస్కురాలైన స్కూబా డైవర్‌గా అధికారికంగా గుర్తించింది. నీటి అడుగున నిమిషం కాలంలో 55 హ్యాండ్ సిగ్నల్స్ ఇవ్వడం, 60 సెకన్లలో 50 మీటర్ల దూరం ప్రయాణించడం, 45 రకాల సముద్ర జీవులను గుర్తించడం వంటివి ఆమె నెలకొల్పిన రికార్డులలో ఉన్నాయి.

ఇరా ప్రస్తుతం కర్ణాటకలోని కార్వార్‌లో ఉన్న నావల్ చిల్డ్రన్ స్కూల్‌లో విద్యనభ్యసిస్తోంది. ఆమె తల్లిదండ్రులు కమాండర్ స్నేహ్ బుడకోటి, కమాండర్ ఆదిత్య రౌత్ ఇద్దరూ భారత నావికాదళంలో అధికారులగా సేవలందిస్తున్నారు. ఆమె తాతయ్య కూడా నేవీలో రిటైర్డ్ కమాండర్ కావడం గమనార్హం. వీరి కుటుంబ మూలాలు మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో ఉన్నాయి.

తన ఘనతపై ఇరా స్పందిస్తూ.. "నీటి అడుగున స్కూబా డైవింగ్ చేయడం చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇంత చిన్న వయసులోనే రికార్డులు సాధించడం సంతోషంగా ఉంది. సముద్ర ప్రపంచం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను" అని పేర్కొంది. స్కూబా స్కూల్స్ ఇంటర్నేషనల్ నిబంధనల ప్రకారం, స్కూబా డైవింగ్ కోర్సుకు కనీస వయసు 10 ఏళ్లు కాగా, ఆ వయసు నిండిన వెంటనే ఇరా ఈ అర్హత సాధించి రికార్డు సృష్టించడం విశేషం.