ఖలిస్థానీ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ దాఖలు చేసిన సివిల్ దావాకు సంబంధించి అమెరికా ఫెడరల్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. భారత జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాజీ చీఫ్ సమంత్ గోయల్‌కు ఢిల్లీలోని స్థానిక కోర్టుల ద్వారా సమన్లు అందజేయాలని న్యూయార్క్ సదరన్ డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశించింది. హేగ్ కన్వెన్షన్, భారత సివిల్ ప్రొసీజర్ కోడ్ (సీపీసీ) నిబంధనలను ఉటంకిస్తూ న్యాయమూర్తి కేథరిన్ పోల్క్ ఫైల్లా ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు.

ఈ ఆదేశాల ప్రకారం.. అజిత్ దోవల్‌కు సంబంధించిన సమన్లను పాటియాలా హౌస్ జిల్లా కోర్టుకు, సమంత్ గోయల్‌కు సంబంధించిన పత్రాలను ద్వారకా, తీస్ హజారీ జిల్లా కోర్టులకు పంపాలని అమెరికా కోర్టు తన క్లర్క్‌ను ఆదేశించింది. ఈ సివిల్ కేసులో ప్రతివాదులకు సమన్లు అందేలా భారత కోర్టులు సహకరించాలని న్యాయమూర్తి కోరారు. భారత సీపీసీ ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన విదేశీ కోర్టుల సమన్లను స్థానిక భారతీయ న్యాయస్థానాల ద్వారా జారీ చేయవచ్చని ఆమె పేర్కొన్నారు. గతంలో దౌత్య మార్గాలు, హేగ్ కన్వెన్షన్ ప్రామాణిక పద్ధతుల ద్వారా పంపిన సమన్లను భారత్ తిరస్కరించడంతో, ఈ ప్రత్యామ్నాయ మార్గాన్ని అమెరికా కోర్టు ఎంచుకుంది.

భారత దర్యాప్తు సంస్థల మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న పన్నూన్.. తన హత్యకు కుట్ర పన్నారంటూ పరిహారం కోరుతూ అమెరికాలో ఈ సివిల్ దావా వేశాడు. అయితే ఈ కేసును భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదంతా కల్పితమైన, దురుద్దేశపూర్వక చర్య అని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. న్యాయపరమైన పత్రాల అందజేత కేవలం కేంద్ర న్యాయశాఖ ద్వారానే జరగాలని, ఇలాంటి నిరాధార దావాలను తిరస్కరిస్తున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇప్పటికే స్పష్టం చేశారు.