సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ (డీఎం) వ్యవహారశైలిపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. కార్మికులతో సమావేశమైన సమయంలో డీఎం కుర్చీలో కూర్చోగా, కార్మికులు నేలపై కూర్చున్నట్లుగా ప్రచారంలోకి వచ్చిన ఘటనపై ఆయన పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీతో మాట్లాడి, ఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "సిద్దిపేట డిపోలో జరిగిన ఘటన నా దృష్టికి వచ్చింది. ఈ అంశంపై తక్షణమే ఆర్టీసీ ఎండీతో మాట్లాడి, సమగ్ర విచారణ జరిపించాలని ఆదేశించాను. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి" అని తెలిపారు.

ప్రజా పాలన ప్రభుత్వంలో కార్మికుల సంక్షేమానికి, వారి ఆత్మగౌరవానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఆయన పునరుద్ఘాటించారు. "ఆర్టీసీ సంస్థ అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో కీలకం. సంస్థ కోసం నిరంతరం శ్రమిస్తున్న కార్మికులను గౌరవంగా చూడాల్సిన బాధ్యత ప్రతి అధికారిపై ఉంది. వారి ఆత్మగౌరవానికి భంగం కలిగించేలా ఎవరు వ్యవహరించినా సహించే ప్రసక్తే లేదు" అని మంత్రి స్పష్టం చేశారు.

కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా, అగౌరవంగా ప్రవర్తించే అధికారులపై భవిష్యత్తులో కఠిన చర్యలు తప్పవని పొన్నం ప్రభాకర్ గట్టిగా హెచ్చరించారు. అధికారులు తమ పరిధిలో కార్మికులతో గౌరవప్రదంగా, బాధ్యతాయుతంగా మెలగాలని ఆయన హితవు పలికారు.