రోజూ నాలుగు గోడల మధ్య వర్క్ ఫ్రమ్ హోం చేసి విసుగెత్తిన ఐటీ ఉద్యోగులకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ) శుభవార్త చెప్పింది. ఇకపై వారు ఆహ్లాదకరమైన ప్రకృతి వాతావరణంలో, పార్కుల నుంచి తమ ఆఫీస్ పనులు చక్కబెట్టుకునేందుకు వీలుగా ‘వర్క్ ఫ్రమ్ పార్క్’ అనే వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. ఈ విషయాన్ని సీఎంసీ కమిషనర్ జి.సృజన శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు.

నగరంలో వర్క్ ఫ్రమ్ హోం సంస్కృతి పెరగడంతో, ఉద్యోగులకు ప్రశాంతమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును రూపొందించినట్లు ఆమె తెలిపారు. దుబాయ్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ తరహా థీమ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, దేశంలోనే తొలిసారిగా సైబరాబాద్‌లో దీనిని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సాధారణంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ కోసం ఉపయోగపడే పార్కులను, పగటిపూట కూడా ప్రజలకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతున్నామని వివరించారు.

పైలట్ ప్రాజెక్టు కింద శేరిలింగంపల్లి జోన్‌లోని మజీద్‌బండ మాధవహిల్స్ కాలనీ పార్కులో, కూకట్‌పల్లి జోన్‌ పరిధిలోని మాదాపూర్‌లోని మరో పార్కులో పనులు ప్రారంభించినట్లు కమిషనర్ తెలిపారు. ఈ పార్కుల్లో ఉద్యోగులు ల్యాప్‌టాప్‌లతో పనిచేసుకునేందుకు ప్రత్యేక డెస్క్‌లు, కుర్చీలు, ల్యాప్‌టాప్ ఛార్జింగ్ పాయింట్లు, హైస్పీడ్ వైఫై, కో-వర్కింగ్ సీటింగ్, స్టార్టప్ మీటింగ్ హాళ్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. భద్రత కోసం సీసీ కెమెరాలతో పాటు, అల్పాహారం కోసం కెఫెటేరియాలు కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.

ఈ సౌకర్యాల నిర్వహణ కోసం వినియోగదారుల నుంచి నామమాత్రపు రుసుము వసూలు చేయనున్నట్లు ఆమె తెలిపారు. జనవరి 1 నాటికి ఈ రెండు పార్కులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాబోయే రోజుల్లో మరో 30 నుంచి 40 పార్కులకు ఈ సదుపాయాన్ని విస్తరిస్తామని సృజన తెలిపారు. దీంతోపాటు, కార్పొరేషన్ పరిధిలోని 770 ఖాళీ స్థలాలను ఆక్రమణల నుంచి కాపాడి, వాటిలో 300 స్థలాలను సంక్రాంతి నాటికి పూర్తిస్థాయి పార్కులుగా అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.