రంగారెడ్డి జిల్లాలో పండ‌గ‌పూట ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 'అప్పా' జంక్షన్ వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కూలీలతో వెళుతున్న ఆటో అదుపుతప్పి ముందు వెళుతున్న టిప్పర్‌ను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

పోలీసుల కథనం ప్రకారం.. సుమారు 17 మంది కూలీలు ముచ్చింతల్‌లోని చిన్న జీయర్ స్వామి ఆశ్రమంలో మొక్కలు నాటే పని ముగించుకుని ఆటోలో మొయినాబాద్‌కు తిరిగి బయలుదేరారు. తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఎగ్జిట్ 17 సమీపంలోకి రాగానే వీరి ఆటో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో సురజ్‌ (35), పెంటయ్య (45), లింగరాజు (35) తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ప్రమాద సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని, స్వల్ప గాయాలైన మిగతా వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.