తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు, సుదీర్ఘ జీవితాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రత్యేకంగా లేఖ రాశారు.

దేశం అభివృద్ధి, ప్రగతి, సమ్మిళిత వృద్ధి దిశగా వేగంగా ముందుకెళ్తున్న తరుణంలో రాష్ట్ర అభివృద్ధికి రేవంత్‌రెడ్డి చేస్తున్న కృషి మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన జీవితం సంతోషం, ప్రశాంతత, సౌభాగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు.

ప్రధాని పంపిన లేఖను రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు. శుభాకాంక్షలు తెలిపినందుకు మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. మీ ఆప్యాయతతో కూడిన సందేశానికి ధన్యవాదాలని పేర్కొన్నారు.

లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, తెలంగాణ గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. రేవంత్‌రెడ్డికి శుభాకాంక్షలు చెబుతూ.. ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.

ఏపీ మంత్రి నారా లోకేశ్‌ సైతం రేవంత్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో మరెన్నో ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు. ఎన్సీపీ ఉపాధ్యక్షురాలు సుప్రియా సూలే కూడా శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ మంత్రులు, వివిధ పార్టీల నాయకులు ముఖ్యమంత్రికి జన్మదిన సందేశాలు పంపారు.

రేవంత్‌రెడ్డి 1969 నవంబరు 8న ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా కొండారెడ్డిపల్లిలో జన్మించారు.