విశాఖ మేయర్ ఎన్నికల్లో కూటమి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఓటమి అనంతరం వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి స్పందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు తమకు ఓటు వేసిన ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో, నూతన మేయర్‌గా ఎన్నికైన కూటమి అభ్యర్థి ముక్కా శ్రావణికి అభినందనలు తెలియజేశారు.

అధికారం, డబ్బు, మూడు పార్టీల కూటమి బలాన్ని తట్టుకుని వైసీపీ శ్రేణులు వీరోచితంగా పోరాడాయని కొనియాడారు. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయినా, విశాఖ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నామని పేర్కొన్నారు. తమపై నమ్మకంతో ఓటేసిన సుమారు 3.40 లక్షల మంది ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

నూతన పాలకవర్గానికి ఆమె కీలక సూచన చేశారు. విశాఖ ప్రజల కష్టార్జితమైన రూ.1,700 కోట్ల జీవీఎంసీ నిధులను దారి మళ్లించారని, కొత్త పాలకవర్గం తమ అధికారాన్ని ఉపయోగించి ఆ నిధులను తిరిగి జీవీఎంసీకి రప్పించాలని కోరారు. ఆ నిధులతో నగరంలో మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

గెలుపోటములతో సంబంధం లేకుండా నిరంతరం ప్రజాక్షేత్రంలోనే ఉంటానని వరుదు కల్యాణి స్పష్టం చేశారు. ఎమ్మెల్సీగా, పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా ప్రజల హక్కుల కోసం, ముఖ్యంగా మహిళలపై జరిగే అరాచకాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తానని తెలిపారు. 2029 ఎన్నికల్లో విశాఖలో వైసీపీ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపునిచ్చారు.