కుటుంబ కలహాలు ఏడుగురి ప్రాణాలను బలిగొన్నాయి. భార్యతో తరచూ గొడవలు పడుతున్న ఓ క్యాబ్ డ్రైవర్‌.. ఆమె కుటుంబంపై కక్ష పెంచుకుని ఏకంగా ఏడుగురిని హతమార్చాడు. పోలీసుల కథనం ప్రకారం.. భార్యతో పాటు అత్త, ఇద్దరు బావమరుదులు, వారి భార్యలు, ఏడేళ్ల బాలుడిని కూడా వదలకుండా కిరాతకంగా చంపాడు. ఈ దారుణ ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు ఇందుశేఖర్‌ను రాజాజీనగర్‌ పోలీసులు అరెస్టు చేశారు.

ఇందుశేఖర్‌కు సునీతతో సుమారు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే సునీత తన పుట్టింటి వారితో సన్నిహితంగా ఉండటం నిందితుడికి నచ్చేది కాదు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. సునీతకు ఆమె తల్లి, సోదరులు అండగా నిలవడంతో వారిపై కూడా ఇందుశేఖర్‌ ద్వేషం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఏడుగురిని అంతమొందించేందుకు ముందుగానే పథకం వేశాడు.

మొదట తన ఇంట్లోనే భార్య సునీతను రోకలిబండతో కొట్టి చంపాడు. ఆ తర్వాత ఆమె స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిందని కుటుంబ సభ్యులను నమ్మించాడు. అనంతరం మద్యం తాగుదామంటూ బావమరుదులు శివకుమార్‌, శంకర్‌లను ఇంటికి పిలిచి హత్య చేశాడు. వారి భార్యలు దివ్య, నళినితో పాటు అత్త రూపావతిని, ఏడేళ్ల మనవడు పునీత్‌ను కూడా హతమార్చినట్లు నిందితుడిపై ఆరోపణలు ఉన్నాయి.

నళిని కనిపించకుండా పోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో ఇందుశేఖర్‌ పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతడి ఇంట్లో లభించిన ఆధారాలతో విచారించగా హత్యల విషయం బయటపడింది.

మృతదేహాలను నంది హిల్స్‌ పరిసర ప్రాంతాల్లో వేర్వేరు చోట్ల పడేసినట్లు నిందితుడు చెప్పడంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు. గురువారం దాదాపు నాలుగు గంటలపాటు వెతికి ఏడేళ్ల పునీత్‌ మృతదేహాన్ని చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలో గుర్తించారు. మిగిలిన ఆరుగురి మృతదేహాల కోసం గాలిస్తున్నారు. హత్యలకు ఉపయోగించిన రోకలిబండను కడిగేసినట్లు, ఇంట్లో రక్తపు మరకలను శుభ్రం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాలను తరలించేందుకు ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు ‘తానా వరది’ పేరుతో ఓ పత్రికను నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఎనిమిదేళ్లుగా భాష్యం సర్కిల్‌ సమీపంలోని అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఇంటి యజమానితో ఉన్న వివాదం కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. వెస్ట్‌ డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ వంశీకృష్ణ, నార్త్‌ డివిజన్‌ డీసీపీ నేమగౌడ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఆధారాలు సేకరిస్తున్నాయి.