వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందుల నియోజకవర్గంలో మరోసారి రాజకీయ వేడి రాజుకుంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పలు గ్రామాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలతో పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పులివెందుల మండలంలోని ఆర్. తుమ్మలపల్లి గ్రామంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైన వాగ్వాదం ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన రాళ్ల దాడిలో కృష్ణారెడ్డి అనే వైసీపీ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో గ్రామంలో ఒక్కసారిగా టెన్షన్ పెరిగింది.

ఇదిలా ఉండగా, లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్ ఏజెంట్ల విషయంలో వివాదం చెలరేగింది. తమ ఏజెంట్లను కేంద్రంలోకి అనుమతించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకొని అక్కడికి వెళ్తున్న ఎంపీ అవినాష్ రెడ్డిని పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. మరోవైపు, పెద్దముడియం మండలం గుండ్లకుంటలో వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఎర్రిపల్లిలో పోలీసులు ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ ఆరోపణలు రావడంతో అక్కడ కూడా కొంతసేపు ఉద్రిక్తత కనిపించింది. వరుస ఘటనల నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గంలోని సమస్యాత్మక గ్రామాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు.