వర్షం పడుతున్నప్పుడు విమానంలో ప్రయాణించాలంటే చాలామందికి ఆందోళన కలుగుతుంది. బయట వాతావరణం సరిగా కనిపించకపోతే పైలట్లు విమానాన్ని ఎలా నడుపుతారు? భారీ వర్షంలో విమానం సురక్షితంగా ప్రయాణించగలదా? ఇలాంటి సందేహాలకు ఇండిగో పైలట్‌ కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌ సమాధానమిచ్చారు. వర్షంలోనూ విమాన ప్రయాణం సురక్షితమేనని ఆయన భరోసా ఇచ్చారు.

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ వీడియోలో.. వర్షం పడుతున్నప్పుడు విమానాన్ని నడిపేందుకు కాక్‌పిట్‌లో ఉపయోగించే ప్రత్యేక పరికరాల గురించి వివరించారు. బయట దృశ్యాలు స్పష్టంగా కనిపించకపోయినా.. విమానంలోని ఆధునిక పరికరాల సాయంతో పైలట్లు మార్గాన్ని గుర్తిస్తూ ప్రయాణాన్ని కొనసాగిస్తారని తెలిపారు. 

వైపర్లు, రెయిన్‌ రిపెల్లెంట్‌
కార్లలో మాదిరిగానే విమానాల విండ్‌షీల్డ్‌పైనా వైపర్లు ఉంటాయి. వీటిని ప్రధానంగా టేకాఫ్‌, ల్యాండింగ్‌ సమయంలో ఉపయోగిస్తారు. వర్షపు నీరు కారణంగా పైలట్లకు ఎదురయ్యే ఇబ్బందిని తగ్గించేందుకు విండ్‌షీల్డ్‌పై ప్రత్యేకమైన రెయిన్‌ రిపెల్లెంట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తారు. దీనివల్ల ముందు వైపు దృశ్యాలు మరింత స్పష్టంగా కనిపిస్తాయి.

వెదర్‌ రాడార్‌ కీలకం
విమానంలో ఉండే వెదర్‌ రాడార్‌.. ప్రయాణ మార్గంలో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పైలట్లకు తెలియజేస్తుంది. వాతావరణ తీవ్రతను వేర్వేరు రంగుల ద్వారా సూచిస్తుంది. దీంతో ప్రమాదకర వాతావరణ పరిస్థితులను ముందుగానే గుర్తించి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది.

జారిపోకుండా యాంటీ స్కిడ్‌ వ్యవస్థ
వర్షం కారణంగా రన్‌వేపై నీరు నిలిచినప్పుడు విమానం చక్రాలు జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో విమానం అదుపు తప్పకుండా యాంటీ స్కిడ్‌ వ్యవస్థ తోడ్పడుతుంది. చక్రాలు నీటిపై తేలినట్లుగా మారి రన్‌వేతో పట్టును కోల్పోయే ఆక్వాప్లానింగ్‌ పరిస్థితిని నివారించడంలో ఇది సహాయపడుతుంది.

మంచు పేరుకోకుండా యాంటీ ఐస్‌
విమాన ప్రయాణంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి మంచు పేరుకునే పరిస్థితులు ఎదురైనప్పుడు యాంటీ ఐస్‌ వ్యవస్థను ఉపయోగిస్తారు. విమానంలోని కీలక భాగాలపై మంచు ఏర్పడకుండా వేడి సాయంతో ఈ వ్యవస్థ పనిచేస్తుందని కెప్టెన్‌ వివరించారు.

వర్షంలో విమాన ప్రయాణం సురక్షితమేనా అన్న ప్రశ్నకు కెప్టెన్‌ ప్రదీప్‌ కృష్ణన్‌.. కచ్చితంగా సురక్షితమేనని సమాధానమిచ్చారు. అయితే వాతావరణం తీవ్రంగా ప్రతికూలంగా ఉన్నప్పుడు భద్రతకు ప్రాధాన్యమిస్తూ విమానాల ఆలస్యం, దారి మళ్లింపు లేదా రద్దు వంటి నిర్ణయాలు తీసుకోవచ్చని విమానయాన నిపుణులు వివరిస్తున్నారు.