బెంగళూరులోని మల్లేశ్వరంలో ఒక ఇంటి బయట ఎల్పీజీ సిలిండర్ పేలిన ఘటన తీవ్ర భయాందోళనలు సృష్టించింది. లీకవుతున్న గ్యాస్ సిలిండర్, ఇంటి గుమ్మం వద్ద వెలిగించి ఉన్న దీపానికి తగలడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో డెలివరీ ఏజెంట్ త్రుటిలో ప్రాణాలతో బయటపడగా, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సంఘటన డెలివరీ ఏజెంట్లకు ఇచ్చే భద్రతా శిక్షణపై చర్చకు దారితీసింది.

అస‌లేం జ‌రిగిందంటే..!
ఓ డెలివరీ ఏజెంట్ భుజంపై గ్యాస్ సిలిండర్‌తో మల్లేశ్వరంలోని ఒక ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇంటి యజమానురాలు పూజలో భాగంగా ఇంటి గుమ్మాన్ని శుభ్రం చేసి, అక్కడ ఒక నూనె దీపం వెలిగించి ఉంచారు. ఈ విషయం గమనించని డెలివరీ ఏజెంట్, అప్పటికే స్వల్పంగా లీక్ అవుతున్న సిలిండర్‌ను గుమ్మానికి సమీపంలో పెట్టాడు. దీంతో సిలిండర్ నుంచి వస్తున్న గ్యాస్ దీపం మంటలకు అంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు వ్యాపించగానే డెలివరీ ఏజెంట్ వెంటనే అప్రమత్తమై పక్కకు జరగడంతో అతనికి ఎటువంటి తీవ్ర గాయాలు కాలేదు.

సమాచారం అందుకున్న మల్లేశ్వరం పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ ప్రమాదంలో ప్రజలకు ఎవరికీ గాయాలు కాలేదని, ప్రాణాపాయం జరగలేదని పోలీసులు స్పష్టం చేశారు. ఎల్పీజీ సిలిండర్లను రవాణా చేసేటప్పుడు, అమర్చేటప్పుడు ప్రజలు, డెలివరీ సిబ్బంది మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సోషల్ మీడియాలో భద్రతపై చర్చ
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ‘ఎక్స్‌’ లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, డెలివరీ ఏజెంట్ స్పందించిన తీరు, వారి భద్రతా శిక్షణపై తీవ్రస్థాయిలో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. "ప్రమాదకరమైన వస్తువును సరఫరా చేసే వ్యక్తి పరిస్థితిని మరింత మెరుగ్గా ఎదుర్కోవాలి. బహుశా అతనికి సరైన శిక్షణ లేనట్టుంది" అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

మరొకరు, "లీకవుతున్న గ్యాస్‌కు వాసన, శబ్దం రెండూ ఉంటాయి. గుమ్మంలో దీపం చూశాక కూడా సిలిండర్‌ను అక్కడ పెట్టడం డెలివరీ ఏజెంట్ చేసిన పెద్ద తప్పు. పైగా, ఎల్పీజీ మంటలను ఆర్పడానికి నీళ్లు వాడటం అతని అవగాహనారాహిత్యానికి నిదర్శనం. తడి గుడ్డను కప్పి మంటలను అదుపు చేయాలి" అంటూ తీవ్రంగా విమర్శించారు. "శిక్షణ లేని ఉద్యోగి ఒక విపత్తుకు కారణం కాగలడు" అని మరో యూజర్ ఆందోళన వ్యక్తం చేశారు.

అయితే, మరికొందరు భిన్నంగా స్పందిస్తూ, "ఒకవేళ గుమ్మం దగ్గర మంటలు అంటుకోకపోయి ఉంటే, ఆ లీకైన సిలిండర్‌ను ఇంట్లోకి తీసుకెళ్లేవారు. అప్పుడు లోపల పేలుడు జరిగి మరింత పెద్ద ప్రమాదం సంభవించేది. బయటే జరగడం ఒకరకంగా మంచిదైంది" అని అభిప్రాయపడ్డారు. మొత్తంమీద ఈ ఘటన ప్రమాదకరమైన వస్తువులను సరఫరా చేసే సిబ్బందికి భద్రతా శిక్షణ ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. ప్రస్తుతం అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.