భారత సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'రామాయణ'పై టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్ రావణుడిగా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం రేపు (నవంబర్ 5) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో, చిత్ర బృందానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు.

ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని, మన సంస్కృతికి, మన కథలకు నిలువుటద్దమని అల్లు అర్జున్ అభిప్రాయపడ్డారు. "రామాయణ చిత్ర బృందం మొత్తానికి నా శుభాకాంక్షలు. ఇది కేవలం ఒక సినిమా కాదు. ఇది మన సంస్కృతికి ప్రతిబింబం, భారతీయ చిత్రాల స్థాయిని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దే ఒక ప్రయత్నం. ఈ దైవ ప్రయత్నం చేస్తున్న టీం మొత్తానికి నా స్వచ్ఛమైన, సానుకూల శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పంపుతున్నాను" అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు.

ఇటువంటి గొప్ప ప్రయత్నాలకు పరిశ్రమలకతీతంగా అందరూ మద్దతుగా నిలవాలని బన్నీ పిలుపునిచ్చారు. "మన కథలను, మన సంస్కృతిని, మన కీర్తిని ముందుకు తీసుకెళ్లే ఈ స్వచ్ఛమైన ప్రయత్నానికి మనమందరం ఏకమై మద్దతుగా నిలుద్దాం. జై శ్రీ రామ్" అంటూ తన పోస్టును ముగించారు.

భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందిన 'రామాయణ' మొదటి భాగంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.