న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ ఫీల్డింగ్‌లో అద్భుతాలు చేశారు. ఒకరు ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్‌ అందుకోగా.. మరొకరు మెరుపు వేగంతో బంతిని అందుకుని రనౌట్‌లో భాగమయ్యారు. ఈ రెండు సూపర్‌ ఫీల్డింగ్‌ విన్యాసాలతో ‘రో-కో’ జోడీ అభిమానులను మరోసారి అలరించింది.

మ్యాచ్‌లో తొలుత రోహిత్‌ శర్మ తన ఫీల్డింగ్‌ విన్యాసంతో ఆకట్టుకున్నాడు. న్యూజిలాండ్‌ బ్యాటర్‌ డారిల్‌ మిచెల్‌ 22వ ఓవర్‌లో అక్షర్‌ పటేల్‌ బంతిని లెగ్‌ సైడ్‌ ఆడాడు. దీంతో మిడ్‌ వికెట్‌ నుంచి వేగంగా ముందుకొచ్చిన రోహిత్‌ బంతిని అందుకున్నాడు. క్రీజులో ఉన్న బ్యాటర్లు కాసేపు తడబడటంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే అండర్‌ ఆర్మ్‌ త్రో విసిరాడు. వికెట్ల వెనుక ఉన్న కేఎల్‌ రాహుల్‌ బంతిని అందుకుని బెయిల్స్‌ పడగొట్టడంతో మిచెల్‌ రనౌటయ్యాడు. ఈ వికెట్‌తో న్యూజిలాండ్‌ ఐదో వికెట్‌ కోల్పోయింది. 

ఇక 29వ ఓవర్‌లో విరాట్‌ కోహ్లీ తన ఫీల్డింగ్‌ విన్యాసంతో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాడు. అన్షుల్‌ కాంబోజ్‌ వేసిన బంతిని న్యూజిలాండ్‌ బ్యాటర్‌ నాథన్‌ స్మిత్‌ గట్టిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బ్యాట్‌ అంచుకు తగిలిన బంతి స్లిప్‌ వైపు దూసుకొచ్చింది. అక్కడే ఉన్న కోహ్లీ కుడివైపు డైవ్‌ చేస్తూ నేలకు అతి సమీపంలో ఒంటి చేత్తో బంతిని అందుకున్నాడు. బంతి నేలను తాకిందా? లేదా? అన్న అనుమానంతో అంపైర్లు థర్డ్‌ అంపైర్‌ సమీక్ష కోరారు. చివరకు క్యాచ్‌ క్లీన్‌గా పట్టినట్లు తేలడంతో స్మిత్‌ పెవిలియన్‌కు చేరాడు.

క్యాచ్‌ అందుకున్న ఆనందంలో కోహ్లీ విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్లుగా ప్రత్యేకంగా సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత సహచరుల వైపు చూస్తూ సరదా హావభావాలు ప్రదర్శించాడు. ఈ రెండు ఘటనలకు సంబంధించిన వీడియోలు క్రికెట్‌ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వయసు పెరుగుతున్నా ఫిట్‌నెస్‌, చురుకుదనంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు రోహిత్‌, కోహ్లీ తమ ఆటతో చాటిచెప్పారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.