మిర్చి రైతులు, ఎగుమతిదారులు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగారు. శ్రీలంకలోని కొలంబో పోర్టులో నిలిచిపోయిన మిర్చి కంటైనర్ల సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. తక్షణమే జోక్యం చేసుకుని ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు.

చైనా, బంగ్లాదేశ్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, సింగపూర్ వంటి దేశాలకు ఎగుమతి కావాల్సిన 150కి పైగా మిర్చి కంటైనర్లు కొలంబో పోర్టులో చిక్కుకుపోయాయని ముఖ్యమంత్రి తన లేఖలో వివరించారు. ఈ కంటైనర్లలోని మిర్చిలో తేమ శాతం నిర్దేశిత పరిమితి కంటే ఎక్కువగా ఉందని చెబుతూ, ఆయా దేశాలు వాటిని స్వీకరించేందుకు నిరాకరిస్తున్నాయని తెలిపారు. దీనివల్ల సుమారు రూ.60 కోట్ల విలువైన సరుకు ఎక్కడికీ కదలకుండా పోర్టులోనే నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ కంటైనర్ల నిలిపివేత కారణంగా.. మిర్చి పండించిన రైతులు, ఎగుమతిదారులు తీవ్ర ఆర్థిక నష్టాలను చవిచూస్తున్నారని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో వారిని గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు. సంబంధిత దేశాల ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి, ఈ కన్సైన్‌మెంట్లను స్వీకరించేలా ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యను త్వరగా పరిష్కరించి, రైతులకు, ఎగుమతిదారులకు ఊరట కల్పించాలని లేఖలో కోరారు. ఈ వ్యవహారంపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది.