టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌ చరిత్రలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఈ మైలురాయిని అందుకున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ ఖాతాలో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ 12,988 పరుగులు ఉన్నాయి. ఈ క్రమంలో 13 వేల పరుగుల మైలురాయిని చేరుకోవడానికి అతడికి మరో 12 పరుగులు అవసరమయ్యాయి. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో ఆ పరుగులు సాధించడంతో ఈ ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ జాబితాలో ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్‌ రెండో స్థానంలో ఉన్నాడు. అతడు తన కెరీర్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ 12,662 పరుగులు సాధించాడు. కోహ్లీ ఈ సంఖ్యను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు. శ్రీలంక మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర 9,747 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. 

వన్డేల్లో మూడో స్థానాన్ని తనకు అత్యంత అనుకూలమైన స్థానంగా మార్చుకున్న కోహ్లీ.. ఈ ఘనతతో మరోసారి తన స్థాయిని చాటుకున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్న అతడు, రికార్డుల వేటను కొనసాగిస్తున్నాడు.